కేసీఆర్ పై హుజురాబాద్ ఓటర్ల ఫైర్.. ఈటలకు లైన్ క్లియరేనా?
posted on Oct 28, 2021 @ 11:24AM
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరాటం సాగడంతో నియోజకవర్గంలో గంటగంటకు ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రచార గడువు ముగిసినా.. అంతర్గతంగా నేతలు జనాన్ని కలుస్తూనే ఉన్నారు. ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల నుంచి 10 వేల వరకు ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. లిక్కర్ ఏరులై పారుతుందని అంటున్నారు. ప్రలోభాల్లో అధికార పార్టీ ముందుందనే చర్చ సాగుతోంది.
అయితే హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచేందుకు ఎత్తులు వేస్తున్న అధికార పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ప్రలోభాలు ఆ పార్టీకి నష్టం నష్టం కల్గిస్తుందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బులు అందకపోవడంతో వారంతా రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి శాపనార్దాలు పెడుతున్నారు. తాము ప్రజలము కాదా? మేము ఓటు వేయకుండానే కేసీఆర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు గెలిచారా ?మా ఓట్లు ఎందుకు వద్దంటారు అంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ లో పలు వార్డులకు సంబంధించిన మహిళలు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ చుట్టుపక్కల ఉన్న వాళ్లందరికీ నాయకులు ఓటుకు ఆరువేల రూపాయల చొప్పున నిర్ణయించి, డబ్బులు పంపిణీ చేశారంటూ ఆందోళనకు దిగారు. మాకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే ఇన్‌చార్జీలు, నాయకులు నిర్ణయించినట్లుగా ఇస్తున్నామని, ఒకవేళ మీకు డబ్బులు కావాలంటే ఓటు వేసి వచ్చిన తర్వాత మాకే ఓటు వేశారని రుజువు చూపిస్తే డబ్బులు ఇస్తామని సమాధానం చెబుతున్నారని మహిళలు మండిపడ్డారు. మేము డబ్బులు అడిగామా? ఎందుకు ప్రమాణం చేయాలంటూ, మా ఓటు ఎందుకు వద్దంటున్నారు అని, అందరికీ కేసీఆర్ ప్రమాణం చేయించుకునే డబ్బులు ఇచ్చారా? అంటూ నిలదీశారు. కేసీఆర్ చెప్పిండ్రా? అంటూ వారు ప్రశ్నించారు. ఆరువేల రూపాయలు తీసుకున్న వారంతా కేసీఆర్‌కే ఓటేస్తామని చూపించగలరా? అంటూ టీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటర్లు ఆందోళన చేయడంతో గులాబీ పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. తమకు ఇది తీవ్ర నష్టం కల్గించవచ్చనే ఆందోళన వాళ్లలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోలను నియోజకవర్గంలో వైరల్ చేస్తూ.. పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో గంట గంటకు
నియోజకవర్గంలో సమీకరణలు మారిపోతున్నాయని తెలుస్తోంది.