డేటింగ్ కాల్ సెంటర్ ల ముసుగులో తీవ్రంగా నష్టపోతున్న బాధితులు...
posted on Oct 29, 2019 @ 5:15PM
విశాఖలో బయటపడ్డ హనీట్రాప్ సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన ఇరవై నాలుగు మందిని ట్రాన్ సిట్ వారెంట్ పై వైజాగ్ తీసుకు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు డేటింగ్ కోసం అమ్మాయిలను చూడటం మాట్లాడుకోవడం జరిగేది. అమ్మాయిలు ఒకే చోట ఉండటంతో పోలీసుల దాడుల కేసులు ఎక్కువయ్యాయి. దీంతో ఆన్ లైన్ అస్త్రంతో ముఠాలు వేదికను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఫేక్ డేటింగ్ సైట్ లతో యువతను మోసం చేస్తున్నాయి. ఇలాంటి గ్యాంగ్ ఆటకట్టించారు విశాఖ సైబర్ క్రైం పోలీసులు. కోల్ కత్తా కేంద్రంగా ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం నడుపుతున్నట్లు విశాఖ సైబర్ క్రైం పోలీసుల విచారణలో తేలింది. హనీట్రాప్ లో పది లక్షల రూపాయల నగదును పోగొట్టుకున్న బాధితుల కేసులో తీగ లాగితే డొంక కదిలిందని పోలీసులు వివరించారు. డేటింగ్ సైట్ ల గ్యాంగ్ నుంచి నలభై సెల్ ఫోన్లు, మూడు ల్యాప్ టాప్, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని ఇరవై నాలుగు మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. లొకెంటో షోకాజ్ టిండర్ పోర్టల్ ఇన్ స్టాల్ చేసుకున్న తరవాత అందులో ఇచ్చిన నెంబర్ కు కాల్ చేస్తే ముందుగా సంప్రదిస్తారు. వాట్సప్ కాల్ గానీ చాటింగ్ ద్వారా రమ్మని మిగతా వివరాలు మాట్లాడుకుందామని చెప్తారు. వాట్సప్ ద్వారా చాటింగ్ లోకి వెళ్తే అమ్మాయిలు కావాలా అబ్బాయిలు కావాలా, వయసు ఎంత ఉండాలో కలర్ ఎలా ఉండాలి అనే ప్రశ్నలు అడుగుతూ బాధితుడు చెప్పిన ఆధారాలకు అనుగుణంగా యువతుల ఫొటోలు వాట్సప్ లో పంపుతారు. ముందుగా రిజిస్ర్టేషన్ కు వెయ్యి రూపాయలు కట్టాలని, అమ్మాయితో మాట్లాడటానికి మూడు వేలు కట్టాలని షరతు పెడతారు. అమ్మాయిల సెల్ ఫోన్ నెంబరుకి ఛార్జ్ చేయాలంటే మరో మూడు వేలు కట్టాలని అమ్మాయినీ చూపకుండానే బాధితుల నుంచి లక్షల్లో లాగేస్తారు. బాధితుడు కూడా ఆన్ లైన్ లో చెప్పినట్టుగానే చేసెస్తాడు.
కానీ మాట్లాడుతున్న వారు ఎవరూ ఎక్కడివారు అనే సందేహం కూడా రాని మైకంలోకి వెళ్లిపోతారు. అమ్మాయిలు చెప్పిన చోటికే రావాలని బాధితుడు నివాసముంటున్న లొకేషన్ దగ్గరగా ఉండే ప్రాంతాల పేర్లు చెప్పారు. దీంతో బాధితుడు నిజమని నమ్మి అమ్మాయి చెప్పిన చోటికి వెళతాడు. ఇలా వెళ్ళీ చాలా వరకు యువత మోసపోయిన సందర్భాలే ఎక్కువ. దీంతో మోసపోయామని తెలుసుకున్న తరువాత పోలీసుల దగ్గరకు వెళ్లలేక ఎవరికీ చెప్పుకోలేక బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలా ఈ తరహాలో పదుల సంఖ్యలో బాధితులు మోసపోతున్నారు.
కానీ అందులో ఓ యువకుడు పధ్ధెనిమిది లక్షలు పోగొట్టుకుని తమకు ఫిర్యాదు చేశాడని విశాఖ పోలీసులు తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు ఆరు నెలల్లో మూడు సార్లు ప్రయత్నించారు. కోల్ కత్తా పోలీసుల నుంచి పూర్తిస్థాయిలో సహకారం లభించకపోవడంతో ఇది సాధ్యం కాలేదు. ఇపుడు నిందితులను అరెస్టు చేయడంతో వారి నుంచి సమాచారాన్ని సేకరించి సూత్రధారులను పట్టుకునేందుకు విశాఖ పోలీసులు ప్రయత్నస్తున్నారు.