జడ్పీ ఛైర్మెన్ జనార్దన రాథోడ్ అసలు వ్యూహం ఏమిటి?
posted on Oct 29, 2019 @ 5:00PM
మంచికి పోతే చెడు ఎదురైంది అంటారే అలాగే మారింది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పరిస్థితి. తాజాగా ఆమెనుద్దేశించి జడ్పీ ఛైర్మెన్ జనార్దన రాథోడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి పనులు కావడం లేదని దీనికి కలెక్టర్ దివ్య దేవరాజన్ కారణమని జడ్పీ ఛైర్మెన్ జనార్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పాలన మొత్తం కలెక్టర్ కన్నుసన్నల్లోనే నడుస్తోందని ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పై తిరుగుబాటు చేయమంటూ అని పిలుపివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి రెండేళ్ల క్రితం ఆదివాసీ లంబాడా తెగల మధ్య ఆధిపత్య పోరుతో ఆదిలాబాద్ జిల్లా అట్టుడికిపోయింది. ఆ సమయంలో కలెక్టర్ గా దివ్య బాధ్యతలు చేపట్టారు. నిత్యం జిల్లాలో పర్యటిస్తూ స్వల్ప వ్యవధిలోనే పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గోండి భాషను సైతం ఆమె నేర్చుకున్నారు. గిరిజనుల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని పరిష్కరించడం ద్వారా పాలనలో తనదైన ముద్ర వేశారు. అటు మైదాన ప్రాంతాల్లోనూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శభాష్ అనిపించుకున్నారు. ప్రధానంగా ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇతర సామాజికవర్గ నేతలు ఆక్రమణలో ఉన్న ఆదివాసీల భూముల వ్యవహారంలో కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఏజెన్సీ భూముల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని నిబంధనలను పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అదే విధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో సహజంగానే జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజును ఆదివాసీలు తమ ఆత్మ బంధువుగా పరిగణిస్తున్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ ఏజెన్సీ చట్టాల అమలులో కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు సహజంగానే కొన్ని వర్గాలకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ఆదివాసీల నుంచి అనధికారికంగా భూములను కొనుగోలు చేసిన నాయకులు అప్పులిచ్చి కబ్జాలు చేసుకున్న వాళ్లు వందలెకరాలలో పోడు భూములను చెరబట్టిన అనేక మంది ఆదివాసీ యాత్రలకు కష్టాలు మొదలయ్యాయి. వీళ్ళంతా కలెక్టర్ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. ఇక బోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్ లతో ఆదివాసీల ఉద్యోగాలను కొల్లగొట్టిన వాళ్లల్లోనూ ఆందోళన మొదలైంది. వీళ్లంతా మునుపటిలాగే వ్యవహారం సాగాలని కోరుకుంటున్నారు. అందువల్ల అలాంటి వారు ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ కలెక్టర్ దివ్య దేవరాజన్ ను టార్గెట్ చేశారు అన్నది కొందరి అభిప్రాయం. వాస్తవానికి ప్రభుత్వ అధికారిగా పని చేసిన జనార్ధన్ కొన్నాళ్ల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.
రాజకీయ అరంగేట్రం తోనే టీఆర్ఎస్ లో చేరి జడ్పీ ఛైర్మన్ అయ్యారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ బాస్ గా తన మార్కు చూపాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తొలిరోజుల్లోనే టిఆర్ఎస్ కు చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యె మధ్య భేదం ఏర్పడింది. ఎమ్మెల్యేకు తెలియకుండానే ఆ నియోజకవర్గంలో పని చేస్తున్న పలువురు అధికారులను బదిలీలు చేయించడం వివాదాస్పదమైంది. ఒక జడ్పీటీసీ సభ్యురాలితో దురుసుగా ప్రవర్తించినట్టు కూడా ఆరోపణులున్నాయి. ఇప్పుడు నేరుగా జిల్లా కలెక్టర్ పైనే ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. జడ్పీ చైర్మన్ వ్యవహార శైలిపై సొంత పార్టీ లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జనార్దన్ రాథోడ్ వ్యాఖ్యల వెనుక అసలు ఎజెండా వేరే ఉందనే చర్చ సాగుతోంది. గతంలో జడ్పీ ఛైర్మన్ గా ఉన్న రమేశ్ రాథోడ్ కూడా అధికారులపై దూకుడు ప్రవర్థనతోనే రాజకీయాలలో మెరుగయ్యారట. తాను కూడా అలాగే వ్యవహరిస్తే ప్రజలలో పట్టు పెంచుకోవచ్చని జనార్దన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా ఏజెన్సీలో ఆదివాసేతరులు ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న జనార్దన్ ఒక పథకం ప్రకారం పావులు కదుపుతున్నట్టు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఆదివాసేతరులు మద్దతుంటే ఖానాపూర్ అసెంబ్లీ స్థానాలు సులువుగా గెలవవచ్చని ఆయన భావిస్తున్నారట. ఈ నేపధ్యంలోనే అధికారులపై దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. కలెక్టర్ ను జనార్ధన్ రాథోడ్ విమర్శించడం వెనుక ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ జిల్లా స్థాయి అధికారి ప్రమేయం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ దివ్య దేవరాజన్ ను ఉద్దేశించి జడ్పీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలపై జిల్లాలోని పలు ఉద్యోగ సంఘాల నేతలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జడ్పీ ఛైర్మన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ రెవెన్యూ టీఎన్జీవోస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ సోయం బాపురావు ఓ అడుగు ముందుకేసి జడ్పీ చైర్మన్ జనార్ధన్ పై ఘాటైన విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం తెలుసుకొని మాట్లాడాలంటూ జడ్పీ చైర్మన్ కి గట్టిగా చురకలంటించారు. దీనికి తోడు ఆదివాసీ సంఘాలు కలెక్టర్ కు అండగా నిలుస్తున్న కలెక్టర్ దివ్య దేవరాజన్ కు జడ్పీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో లంబాడ సామాజికవర్గ నేతలు జడ్పీ చైర్మన్ కు మద్దతు తెలుపుతుండటం గమనార్హం. కొందరు ఉద్యోగుల అంతర్గతంగా ఆదివాసీ లంబాడ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో ఎవరికి వారి మద్దతు తెలుపుతుండటం గమనార్హం. అయితే తన చుట్టూ ఇంత రాజకీయ దుమారం రేగుతున్న కలెక్టర్ దివ్య మాత్రం దీన్ని లైట్ గా తీసుకున్నారు. ఎప్పటిలాగే తన పంతాన్ని చేసిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.