కేరళను కలవర పెడుతున్న నిఫా.. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్
posted on Sep 6, 2021 @ 10:49AM
థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, దేశమంతా కరోనా సెకండ్ వేవ్ చాలా వరకు తగ్గిపోయింది. ఇందుకు ఒకే ఒక్క ఒక్క మినహాయింపు కేరళ. దేశం మొత్తంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మూడొంతుల వరకు కరోనా కేసులు ఒక్క కేరళ రాష్టంలోనే నమోదవుతున్నాయి. నిత్యం దాదాపు అక్కడ 30వేల పాజిటివ్ కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతున్నాయి. అలాగే విస్తరణ రేటు, క్రియాశీల కేసుల సంఖ్య, మరణాల సంఖ్య/శాతం ఇలా అన్ని ప్రామాణికాలు కేరళలో కరోనా ఉదృతి కొనసాగుతుందనే హెచ్చరిస్తున్నాయి.
ఇప్పుడు, కేరళలో నిఫా వైరస్ మూడోసారి కాలు పెట్టింది. ఇది చాలా ప్రాణాంతక వైరస్. తొలిసారి 2018 జూన్‌లో నిఫా వైరస్ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో మొత్తం 18 కేసులు నిర్ధారణ కాగా 17మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, అదే ఏడాది జూన్ 10 నాటికి వైరస్ ని కట్టడి చేయడంతో పెద్ద ముప్పు తప్పింది. కానీ, 2019లో మరోసారి ఒకరిలో నిఫా వైరస్ నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో ఒక్క కేసుతోనే వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కానీ, ఈ సారి కరోనాతో కలిసి వచ్చిన ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ సోకి ఇప్పటికే ఓ బాలుడు మృతి చెందగా.. తాజాగా మరో ఇద్దరు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిఫా లక్షణాలు గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు బాలుడికి సన్నిహితంగా మెలిగిన వారిని 20 మంది హై రిస్క్ కాంటాక్టులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్యశాఖ పేర్కొంది.
‘12ఏళ్ల బాలుడు నిఫా వైరస్‌తోనే మరణించినట్లు నిర్ధారించాం. కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టాం. ఇప్పటివరకు 188 కాంటాక్టులను గుర్తించగా వారిలో 20మంది హైరిస్క్ ఉన్నట్లు కనుగొన్నాం. వారిలో ఇద్దరు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిఫా లక్షణాలు కనిపించాయి. వీరిలో ఒకరు ప్రైవేటు ఆస్పత్రివారు కాగా.. మరొకరు కోళికోడ్ మెడికల్ కాలేజీ సిబ్బంది. జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థకు చెందిన బృందంతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం’ అని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. నిఫా వైరస్ విజృంభణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆమె.. ప్రస్తుతం హై రిస్క్ కాంటాక్టులందర్నీ ఐసోలేషన్‌లో ఉండమని ఆదేశించినట్లు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా బాలుడు నివాసమున్న ప్రాంతంలో మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు.
కొవిడ్ విజృంభణ కారణంగా మాస్కులు, పీపీఈ కిట్లు ధరించడంతో నిఫా వల్ల ఆందోళన అక్కర్లేదని మంత్రి వీణా జార్జ్ అభిప్రాయపడ్డారు.అయితే, కరోనా ఉదృతి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితిలో, నిఫా విస్తరణ ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళన అధికారులు వ్యక్త పరుస్తున్నారు. కరోనా, కంటే నిఫా డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకు గతంలో 2018లో 18 మందికి నిఫా వైరస్ సోకింది. అందులో 17 మంది మరణించారు. అంటే, నిఫా డెత్ రేట్ ఏ స్థయిలో ఉందో అర్థమవుతోంది. అందుకే, ప్రభుత్వం భరోసా ఇచ్చినా ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.