విమలక్కపై టిఆర్ ఎస్ ప్రతి విమర్శలు
posted on Oct 1, 2012 @ 4:39PM
ఢిల్లీలో ఎవరికాళ్లో పట్టుకుంటే తెలంగాణ రాదంటూ విమలక్క చేసిన వ్యాఖ్యలపై టిఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమకు ఎవరి కాళ్లూ పట్టుకోవాల్సిన అవసరమే లేదని, అసలు తెలంగాణ ఉద్యమం ఇంతవరకూ వచ్చిందంటే అదంతా కేవలం కేసీఆర్ పుణ్యమేనని టిఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు. నిజంగా టిఆర్ ఎస్ దయనీయ పరిస్థితిలో ఉంటే యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ ఎందుకు కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలే కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఉద్యమం ఊపందుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి రాజకీయ చతురత కూడా అవసరమని , అందుకే కేసీఆర్ హస్తినలో మకాం వేసి వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ వాదుల్ని క్రూరమృగాలతో పోలుస్తున్న లగడపాటికి దేశ బహిష్కరణ శిక్ష విధించాలంటూ జూపల్లి డిమాండ్ చేశారు.