ఓ ఊరినే అమ్మేశారు!
posted on Sep 17, 2012 @ 11:31AM
ధర్మరాజు జూదంలో భార్యను పోగొట్టుకున్నాడని.. హరిశ్చంద్రుడు తన సత్యవ్రతం కోసం భార్యనే అమ్మేశాడని.. విన్నాం. అది ధర్మం, సత్యం, న్యాయం కోసమన్నది అందరికి తెలిసిన సత్యం. అయితే నేటికాలంలో కొద్దిగా పలుకుబడి వుందా?, మాటలతో బురిడి కొట్టించగల నేర్పరులా?, కుందేలును కోతిగా చెప్పించగల నేర్పుందా? అట్లయితే... ఓ.కె. ఈ రాష్ట్రంమీదే...? నిజం.. ఎలా..అని సామాన్యులకు అనుమానమోస్తోందా? ఇదిగో...ఇలా.. గౌనివారిపల్లె రెవిన్యూ గ్రామం (కొండాపురం పంచాయితీ) పరిధిలోని రాంపురం గ్రామపరిధిలోని ఓ కుగ్రామంలోని ఈ భూమి అంతా మాదేనంటూ కొందరు దళారులు ‘రికార్డులు సృష్టించి’ పొరుగురాష్ట్రాలకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి అమ్మేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విధంగా ఆ భూమి తమదేనన్నట్లుగా రికార్డులు కూడా సృష్టించేశారట! అలా ఊరునే అమ్మేసుకున్నారు ఆ ఘనులు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి తమ గ్రామాన్ని కాపాడమంటూ ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారట... వీరిని ఇలాగే వదిలేస్తే ఇప్పుడు ఢిల్లీగా పిలువబడే హస్తినాపురం గతంలో మా పూర్వీకులైన పాండవులేదని.. పట్టాలు పుట్టించి వాటిని మళ్ళీ ఏ తెల్లోడికో అమ్మేయగల నేర్పరులు. వీరి లిస్టులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాంతాలు కూడా ఉన్నాయేమో! దేవుళ్ళారా... చారిత్రక పురుషుల వంశజుల్లారా మా దళారుల కన్ను మీ మీదపడుతుందేమో... బహుపరాక్!