వ్యాక్సిన్ వద్దంటూ దాడి.. ఒకరికి తీవ్రగాయాలు.. పారిపోయిన సిబ్బంది..
posted on May 25, 2021 @ 2:02PM
తెలుగురాష్ట్రాల్లో వ్యాక్సిన్ కోసం పడిగాపులు. వారాల తరబడి ఎదురుచూపులు. ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తారా అంటూ చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు ప్రజలు. సరైన సంఖ్యలో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం.. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో.. జనాలు వ్యాక్సిన్‌కు దూరమవుతున్నారు. సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కోసం ఇంతగా డిమాండ్ ఉంటే.. మధ్యప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి రివర్స్. అక్కడ వ్యాక్సిన్ అంటే భయపడిపోతున్నారు కొందరు జనాలు. టీకా వేయించుకుంటే అనారోగ్యానికి గురవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ ఒంటికి ఏమాత్రం మంచిది కాదనే అపోహతో ఉన్నారు గ్రామీణులు. అందుకే, అలాంటి వారిలో టీకా పట్ల అవగాహన కల్పించి, వారికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వ అధికారులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అలాంటి ప్రయత్నాలే ఇప్పుడు వారి ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. వ్యాక్సిన్ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు.
తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వ్యాక్సిన్ సిబ్బంది ప్రాణ భయంతో కారులో పారిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్ అంటేనే వణికిపోతోన్న గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు అధికారులు అక్కడకు వెళ్లారు. వారి రాకను ముందుగానే గుర్తించిన గ్రామస్థులు కర్రలు పట్టుకుని కాపు కాసి కూర్చొన్నాడు.
వ్యాక్సిన్ సిబ్బంది గ్రామంలోకి అడుగుపెట్టగానే రాళ్లు, కర్రలు పట్టుకుని కొట్టడానికి దూసుకొచ్చారు. కొందరు అధికారులు తప్పించుకుని కారులో పారిపోగా, ఓ పంచాయతీ అధికారిణికి మాత్రం తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఆ గ్రామంలోకి పోలీసులు వచ్చి పరిస్థితులు చేజారకుండా చర్యలు తీసుకున్నారు.
ఓవైపు వ్యాక్సిన్ కావాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నా.. టీకా దొరకని పరిస్థితి ఉంటే.. మద్యప్రదేశ్‌లో మాత్రం వ్యాక్సిన్ వద్దంటూ గ్రామస్తులు ఇలా కర్రలతో దాడులు చేయడం అక్కడి వెనకబాటుతనానికి నిదర్శనం అంటున్నారు.