రెజ్లర్ సుశీల్‌కు ఘనమైన నేర చరిత్ర.. గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే స్కెచ్..
posted on May 25, 2021 @ 1:26PM
రెజ్లర్ సుశీల్‌కుమార్. తొడగొట్టి, పట్టు పడితే.. పతకం గ్యారంటీ. రెండు ఒలంపిక్ మెడల్స్‌ను మెడలో వేసుకున్న మొనగాడు. రింగ్‌లో ఏది చేసినా చెల్లుతుంది. అదే హీరోయిజం బయట చేస్తే విలనిజంగా మారుతుంది. కుస్తీ యోథుడు సుశీల్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. కండలు తిరిగిన శరీరం చూసుకొని.. తాను మల్లయోథుడినని మరిచి.. ఆటల ప్రపంచం నుంచి.. నేర సామ్రాజ్యం వైపు అడుగులు వేశాడు. ఢిల్లీ కేంద్రంగా దందాలు చేయడం మొదలుపెట్టాడు. పలువురు గ్యాంగ్‌స్టర్స్‌తో గూడుపుఠాని చేస్తూ.. నేరాలకు తెగబడుతూ.. ప్రస్తుతం హంతకుడిగా బోణులో నిలబడ్డాడు. ఒకప్పుడు ఏ అభిమానులైతే అతని కుస్తీని చూసి మెచ్చుకుని చప్పట్లు కొట్టారో.. ఇప్పుడు అదే అభిమానులు అతని నేర చరిత్ర చూసి అవాక్కవుతున్నారు. సుశీల్‌కుమార్ మామూలోడు కాదనే విషయం తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
యువ రెజ్లర్ సాగర్ హత్య కేసుతో సుశీల్‌కుమార్ పేరు ఒక్కసారిగా కలకలం రేపింది. వారాల తరబడి పరారీలో ఉన్న సుశీల్‌ను ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కేవలం ఫ్లాట్ ఖాళీ చేయించే ప్రయత్నంలో ఘర్షణ జరిగిందని, అందులో ఆగ్రహంతో సుశీల్ దాడి చేయడంతో యువ రెజ్లర్ సాగర్ మరణించాడని ఇప్పటివరకు అంతా భావించారు.. కానీ హత్య కేసులో సుశీల్ అరెస్టయిన 24 గంటల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. ఇంటర్నేషనల్ రెజ్లర్ సుశీల్ గ్యాంగ్‌స్టర్లతో రాసుకుపూసుకు తిరిగాడని, ఆ క్రమంలో జరిగిన ఆధిపత్య పోరులో ఘర్షణ, బెదిరింపులు, చివరకు దుబాయ్‌లో ఉంటున్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ఒకరు సుశీల్‌కు ధమ్కీ ఇచ్చే వరకు సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రెజ్లర్ సుశీల్ కుమార్ ఎపిసోడ్‌లో నార్త్ ఇండియాకు చెందిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేది పేరు బయటకు వచ్చింది. 18 రోజులపాటు సుశీల్ పరారీలో ఉండటానికి కారణం.. సందీప్ నుంచి తప్పించుకొనేందుకేనని పోలీసులు చెబుతున్నారు.
మే 4న రాత్రి జరిగిన ఘర్షణలో రెజ్లర్ సాగర్‌తో పాటు అతని స్నేహితుడు సోనుపై కూడా సుశీల్ అండ్ కో దాడి చేసింది. ఈ దాడిలో సాగర్ చనిపోగా.. తీవ్రంగా గాయపడిన సోను.. గ్యాంగ్‌స్టర్ సందీప్‌కు మేనల్లుడు. సోనుపై హత్య, బలవంతపు వసూళ్లు, దొంగతనం తదితర 19 కేసులున్నాయి. తన మేనల్లుడిపై దాడి చేయడంతో ఆగ్రహించిన సందీప్.. సుశీల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎందుకంటే గ్యాంగ్‌స్టర్ సందీప్‌కు సోను మేనల్లుడు మాత్రమే కాదు రైట్ హ్యాండ్ కూడా.
గ్యాంగ్‌స్టర్ సందీప్‌తో కలిసి రెజ్లర్ సుశీల్‌కుమార్ గతంలో దందాలు చేసేవాడు. వారిద్దరూ కలిసి.. ఓ డీల్‌లో వాయువ్య ఢిల్లీలోని మోడల్ టౌన్ ఎం-2 బ్లాక్‌లో ఓ ఫ్లాట్ సొంతం చేసుకున్నారు. మొత్తం వివాదానికి ఆ ఫ్లాటే కేంద్రం. పలువురు క్రిమినల్స్‌కు ఆ ఫ్లాట్ అడ్డాగా మారింది. ఢిల్లీ, హరియాణా, యూపీలలో పలు టోల్ ట్యాక్స్ బూత్‌లను సందీప్, లారెన్స్ గ్రూపులు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి.
కానీ, కొద్ది నెలలుగా.. జైలులో ఉన్న సందీప్ ప్రత్యర్థి వర్గం గ్యాంగ్‌స్టర్లు నీరజ్ బవాన, నవీన్ బాలిలతో సుశీల్ కుమార్‌కు స్నేహం కుదిరింది. దాంతో సుశీల్-సందీప్ మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో.. ఢిల్లీలోని ఫ్లాట్ అమ్మేయాలంటూ సుశీల్‌పై సందీప్ ఒత్తిడి పెంచాడు. అందుకు సుశీల్ ఒప్పుకోలేదు. ఆ ఫ్లాట్ తనదని.. అందులో ఉంటున్న సందీప్ మనుషులైన రెజ్లర్ సాగర్ తదితరులను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ సుశీల్ బెదిరించాడు. ఇది సందీప్ గ్యాంగ్‌కు కోపం తెప్పించింది. అప్పటి నుంచి సుశీల్‌పై తిరగబడటం మొదలుపెట్టారు. అందులో భాగంగా.. సుశీల్‌ను సాగర్ బహిరంగంగా తిట్టాడు. దీంతో.. ఆగ్రహానికి గురైన సుశీల్.. దమ్ముంటే చూసుకుందామంటూ సాగర్‌కు సవాల్ విసిరాడు.
ఆ రోజు సుశీల్ అండ్ కో.. సాగర్‌తో పాటు సోనుపై హాకీ స్టిక్స్, బేస్‌బాల్ బ్యాట్స్‌తో దాడి చేశారు. వారిని తీవ్రంగా కొడుతూ.. ఆ దృశ్యాలను తన స్నేహితుడితో వీడియో కూడా తీయించాడు సుశీల్. ఆ వీడియోను సర్క్యులేట్ చేసి.. తన శత్రువులకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపాలనేది సుశీల్ స్కెచ్. అయితే.. ఆ అటాక్‌లో గాయాలు తాళలేక సాగర్ చనిపోవడం.. సోనుకు తీవ్ర గాయాలవడంతో సుశీల్ భయపడిపోయాడు. తన మేనళ్లుడిని కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన గ్యాంగ్‌స్టర్ సందీప్.. సుశీల్ అండ్ ఫ్రెండ్స్‌ను టార్గెట్ చేశాడు. గొడవ జరిగిన రోజు నుంచి వారి కోసం సందీప్ గ్యాంగ్ గాలిస్తూనే ఉంది. ఇటు పోలీసులు, అటు సందీప్ గ్యాంగ్ నుంచి ఎస్కేప్ అవడానికే సుశీల్‌కుమార్ ఎప్పటికప్పుడు ప్లేసెస్ మారుస్తూ.. పరారీలు ఉంటూ వచ్చాడు. ఎట్టకేళకు పోలీసులకు చిక్కగా.. విచారణలో రెజ్లర్ సుశీల్‌కుమార్ నేర చరిత్ర మొత్తం వెలుగు చూస్తోంది.