ఇంద్రకీలాద్రిపై పరోక్ష సేవలకు శ్రీకారం చుట్టిన కనకదుర్గమ్మ దేవస్థానం
posted on Apr 16, 2020 @ 7:04PM
భక్తుల సౌకర్యార్ధం, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో జరిగే రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలను పరోక్షముగా భక్తుల గోత్ర నామాలతో జరిపించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దేవ స్థానంలో అమ్మవారికి, స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నీ కూడా ఏకాంత సేవలుగా యధాప్రకారం ఆలయ అర్చకులు నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు తెలిపారు. దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానం లో జరిగే, నిత్య ఆర్జిత సేవలలో, భక్తులు ప్రత్యక్షం గా పాల్గొనే అవకాశము లేనందువల్ల, అన్ని సేవలు ఆలయ అర్చకులుచే ఏకాంత సేవలుగా నిర్వహిస్తున్నట్టు అయన చెప్పారు.
ఈ పరోక్ష చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలను పరోక్షంగా జరిపించుకోనదలచిన భక్తులు టిక్కెట్లు www.kanakadurgamma.org– website ద్వారా పొందవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి చెప్పారు. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యములో విజయవాడ నగరంలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న రోడ్లపై నివసిస్తున్న యాచకులు, పేద వారు, ఇతరులకు ఆహారం అందించాలన్నఉద్దేశ్యంతో, దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్ విభాగం ద్వారా ప్రతి రోజు కదంబం, దద్దోజనం(పెరుగన్నం) ప్యాకెట్లను వీ ఎం సి సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు. దేవస్థానం జరిపే అన్నదాన కార్యక్రమమునకు విరాళాలు ఇవ్వదలచిన భక్తులు దేవస్థానం వారి వెబ్సైటు www.kanakadurgamma.org ద్వారా , లేదా eosdmsd@sbi అను BHIM UPI ద్వారా QR code ను స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా విరాళములు పంపవచ్చని కార్యనిర్వహణ అధికారి పేర్కొన్నారు.