గండం గడిచిన విజయశాంతి

 

 

 

రాములమ్మ విజయశాంతికి గండం గడిచింది. మెదక్ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని మొదట్లో అనుకున్న విజయశాంతి ఆ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు తెలియడంతో ఎందుకొచ్చిన రిస్క్ అని ఆమె మెదక్ అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ అయిపోయారు. అయితే మెదక్ అసెంబ్లీ స్థానం మీద ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేశారు. నియోజకవర్గం మీద మంచి పట్టు వున్న శశిధర్‌రెడ్డి రెబల్‌గా నామినేషన్ వేయడంతో విజయశాంతి కంగారుపడిపోయారు.

 

రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అయితే బిత్తరపోయింది. శశిధర్‌రెడ్డి నామినేషన్ వేసిన రోజు నుంచి కాంగ్రెస్ నాయకులు శశిధర్‌రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని గడ్డం, కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నా ఆయన మెట్టు దిగలేదు. దాంతో రాములమ్మకి బీపీ హై పిచ్‌కి చేరుకుంది. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు చేసిన మంతనాలు, హామీలు, బుజ్జగింపులు ఫలించి శశిధర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవాడానికి అంగీకరించాడు.

పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పోటీ నుంచి తప్పుకుంటున్నానని, మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి విజయశాంతి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని ప్రకటించాడు. దాంతో విజయశాంతి బీపీ డౌనయి శాంతించింది. గండం గడిచిందని ఊపిరి పీల్చుకుంది.