హుస్నాబాద్: బీజేపీకి దెబ్బమీద దెబ్బ!
posted on Apr 10, 2014 @ 6:42PM
తెలంగాణలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి దెబ్బపడింది. హుస్నాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అసలు అభ్యర్థితోపాటు డమ్మీ అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఈ నియోజకవర్గానికి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ స్థానంలో బీజేపీ గెలిచే అవకాశాలు కూడా వున్నాయి. అయితే నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మధుసూదన్ బీజేపీ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్‌ని తిరస్కరించారు.
నామినేషన్‌తోపాటు ఏ, బీ ఫారాలను అందజేయాల్సి వుండగా శ్రీనివాసరావు కేవలం బీ ఫామ్ మాత్రమే జతచేశారు. దాంతో ఆయన నామినేషన్ తిరస్కరణకి గురైంది. సర్లే ప్రధాన అభ్యర్థి నామినేషన్ పోతే పోయింది. డమ్మీ అభ్యర్థి నామినేషన్ ఉంది కదా అనుకున్న బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ డమ్మీ అభ్యర్థి పోలు లక్ష్మణ్ ఏ ఫారంతోపాటు బీ ఫారం కూడా దాఖలు చేయకపోవడంతో ఈయన నామినేషన్ కూడా గల్లంతయింది. ఇలా ఈ నియోజకవర్గంలో బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడిపోవడంతో రాష్ట్ర బీజేపీ లబోదిబో అంటోంది.