తెరాస ఐడియాలకు జేజేలు
posted on Apr 10, 2014 @ 8:00PM
బహుశః మన రాష్ట్ర రాజకీయ నాయకులలో కేసీఆర్ కుటుంబ సభ్యులంతా మాటకారులు మరెవరూ లేరేమోననిపిస్తుంది వారి మాటలు విన్న ప్రతీసారి. నిజామాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న కేసీఆర్ కుమార్తె కవిత ఈరోజు అక్కడ ప్రచారం ప్రారంబించి, ఆమె ఒక సరికొత్త సిద్ధాంతం ప్రతిపాదించారు. “బీజేపీకి ఓటు వేస్తే అది సీమాంధ్రుడయిన చంద్రబాబుకు వేసినట్లేనని, ఎందుకంటే బీజేపీ చంద్రబాబు జేబు సంస్థగా మారిపోయిందని” అని సూత్రీకరించారు.
ఒకవేళ తెదేపాతో పొత్తులు బెడిసికొడితే బీజేపీతో తామే పొత్తులు పెట్టుకొందామని తెరాస తెరవెనుక ప్రయత్నాలు చేసినప్పుడు,వారికి బీజేపీ మంచిగానే కనబడింది. కానీ తెదేపాతో పొత్తులు పెట్టుకోగానే, బోడి గుండుకి మోకాలికి ముడేసినట్లు, బీజేపీని చంద్రబాబుతో ముడేసి, దానిపై కూడా ‘ఆంధ్రా బ్రాండు’ ముద్ర గుద్దేయవచ్చనే ఆలోచన కేవలం తెరాస నేతలకే సాధ్యం.
కాంగ్రెస్ మీద అవినీతి ముద్ర, వైకాపా, తెదేపాలకు, తెదేపాతో పొత్తు పెట్టుకొన్నబీజేపీ మీద ‘ఆంధ్రా ముద్రలు’ గుద్దేసి అన్ని పార్టీలు కూడా తెలంగాణాలో పోటీకి అనర్హమయినవిగా ప్రకటించేసి, తమ పార్టీకి మాత్రం ‘ఇంటి పార్టీ’ అని ముద్రవేసుకొని ప్రజలను ఆకట్టుకోవాలనే ఐడియా నిజంగా అమోఘం. నిజానికి తెరాసకే అధికారం ఉండి ఉంటే, తెలంగాణాలో తమ పార్టీ తప్ప మరే ఇతర పార్టీలు లేకుండా నిషేదించేసేదేమో!