దుబ్బాక బరిలో రాములమ్మ.. టీఆర్ఎస్ కి ఓటమి తప్పదా?
posted on Sep 3, 2020 @ 10:29AM
ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా కాలంలో కూడా దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అసలు మొదట్లో దుబ్బాక బరిలో టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత నిలవనున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, టీఆర్ఎస్ తరఫున రామలింగారెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరు పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా టీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలో నిలిచినా తాము బరిలోకి దిగి తీరుతామని ఇప్పటికే ప్రకటించాయి. బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీకి దిగనుండగా, కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు విజయశాంతి పేరు తెరమీదకు వచ్చింది.
గతంలో మెదక్ ఎంపీగా వ్యవహరించిన విజయశాంతిని దుబ్బాక బరిలో నిలిపితే పోరు రసవత్తరంగా ఉంటుందన్న ఆలోచన కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విజయశాంతి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. మెదక్ ఎంపీగా పనిచేసిన ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లాపై మంచి పట్టుంది. గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్ కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పుడు విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని, విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసే విషయంపై విజయశాంతి కూడా పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం.
దుబ్బాకలో విజయశాంతి బరిలోకి దిగితే టీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దుబ్బాక టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. రామలింగారెడ్డి కుటుంబం పోటీ పట్ల టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉంది. టికెట్ విషయంలో టీఆర్ఎస్‌లో ఉన్న అనిశ్చితి, నియోజకవర్గంలో విజయశాంతికి పట్టు, పార్టీలకు అతీతంగా ఆమెకున్న వ్యక్తిగత ఇమేజ్.. టీఆర్ఎస్ ను దెబ్బ తీసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.