టీడీపీ నేత అచ్చెన్నాయుడికి త్వరలో ప్రమోషన్..!
posted on Sep 3, 2020 @ 10:59AM
కొద్ది రోజుల క్రితం కరోనా నుండి కోలుకుని ఇంటికి చేరుకున్నటీడీపీ నేత అచ్చెన్నాయుడికి త్వరలోనే పార్టీలో ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన్ను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు కొద్ది రోజులు జైలులో రిమాండ్ లో ఉండి తరువాత బెయిల్ పై ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శాసనసభ లోపల, బయట ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న కారణంగా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నను అరెస్టు చేసి ఇబ్బందిపెడుతోందని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చాక అచ్చెన్న వైసీపీ సర్కారుపై దూకుడు తగ్గిస్తారా లేక మరింత తీవ్రం చేస్తారా అని ఒక పక్క చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో అచ్చెన్నకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు దూకుడుగా వ్యవహరించే అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ లో మెజారిటీ నేతలు భావిస్తున్నారు. దీంతో అచ్చెన్నకు పదవి ఇవ్వడం పై సీనియర్ల ఆమోదం కూడా ఉండటంతో త్వరలోనే చంద్రబాబు తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. దీనిపై చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ ఇప్పటికే మండలస్థాయి వరకు పూర్తీ చేయగా ఇక లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తారని, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తిచేస్తారని తెలుస్తోంది.