స్కిల్ కేసులో బాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు 17న
posted on Jan 14, 2024 8:54AM
స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ప్రభుత్వ తీరు, ఆ కేసులో ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు గమనించిన ఎవరికైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ ను సాధ్యమైనంతగా జాప్యం అయ్యేలా చేసి వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైలులో ఉంచాలన్న వ్యూహమే కనిపించింది. ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తరువాత సహజంగానే చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు.
అక్కడ వాదనలలో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు సూటిగా, సుత్తి లేకుండా ఉంటే.. ప్రభుత్వ తరఫు న్యాయవాది మాత్రం సాధ్యమైనంతగా కాలయాపన చేయడమే లక్ష్యంగా తన వాదనలు వినిపించారు. దీంతో విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కోర్టులో వాదనల తీరు గమనించిన న్యాయనిపుణులు సౌతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికిలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తై తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాత్రం సుదీర్ఘంగా తన పాత వాదనలనే వినిపించారు. ఆయన వాదిస్తున్న సమయంలో పలుమార్లు న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ చంద్రబాబుకు 17ఏ వర్తించదని వాదించిన ప్రతి సందర్భంలోనూ సుప్రీం కోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని ఒక సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.
ఇక స్కిల్ కేసు విషయానికి వస్తే ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టింది. మొదట ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ అర్థరాత్రి అరెస్టు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు నమోదు చేశారు. తర్వాత మరో నాలుగు కేసులు పెట్టారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసులోనూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, ఇసుక, మద్యం విధానాలపై మూడు కేసుల్లో చంద్రబాబుకు ఇటీవలే ముందస్తు బెయిల్ వచ్చింది.
స్కిల్ కేసులోసైతం బెయిల్ లభించింది. ఆ బెయిల్ తీర్పులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసులు చంద్రబాబుకు వ్యతిరేకంగా చిన్న ఆధారం కూడా సీఐడీ చూపించలేదని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి. అయనను అక్రమంగా అరెస్టు చేసినట్లుగా తేలిపోతుంది. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు రిజర్వ్ చేసిన తీర్పును మంగళవారం (జనవరి 17)న వెలువరించనుంది. న్యాయనిపుణుల అంచనా మేరకు ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పు రావడానికి అవకాశాలున్నాయి.