భోగిమంటల్లో ఇప్పుడు జగన్ జీవోలు.. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్!
posted on Jan 14, 2024 @ 11:49AM
తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని గ్రామం మందడంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు కొత్త వెలుగులను సంతరించుకున్నాయి. నాలుగున్నరేళ్ల పోరాటం గెలుపు వాకిట నిలబడిందన్న ఆనందం అందరిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే మందడంలో జరిగిన భోగి వేడుకల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో తెలుగుజాతికి స్వర్ణ యుగం సంక్రాంతి సంకల్పం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీపడ్డారు. సంప్రదాయ దుస్తుల్లో చంద్రబాబు, పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాలుగున్నరేళ్ల నుంచీ చేస్తున్న పోరాటం ఫలించి తమ కల సాకారమౌతున్నదన్న ఆనందం రాజధాని రైతుల్లో స్పష్టంగా కనిపించింది.
అంతకు ముందు భోగికి ముందు రోజు అంటే జనవరి 13న జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి డిన్నర్ కు వెళ్లారు. ఆ సందర్భంగా ఇరువురు నేతలూ ఉమ్మడి మానిఫెస్టో అమలు, పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు, ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి, అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తైందని అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన శ్రేణులు క్షేత్ర స్థాయిలో కలిసి పని చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ కు జగన్ విధానాలు, వ్యవహార శైలిపై ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు, అలాగే సిట్టింగ్ ల మార్పు పేర జగన్ చేసిన, చేస్తున్న ప్రయత్నం కారణంగా వైసీపీలో మొదలైన చిచ్చు ఆ పార్టీ విజయావకాశాలను దాదాపు మృగ్యం చేసేశాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న సానుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కార్యాచరణ రూపొందించారు. వచ్చే రెండు నెలల్లో తెలుగుదేశం, జనసేన అధినేతలు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇప్పటికే ఇన్ చార్జ్ ల మార్పు కారణంగా వైసీపీలో ఎగసిపడుతున్న నిరసనాగ్ని జ్వాలలు తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి కార్యాచరణతో మరింత ప్రజ్వరిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ పట్ల ఆగ్రహం, వ్యతిరేకతతో వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో పోటీకి అవకాశం, హోదా వంటి డిమాండ్లేవీ లేకుండానే బేషరతుగా తెలుగుదేశం, జనసేన కూటమి గూటికి చేరడం ఖాయమని చెబుతున్నారు. మందడంలో భోగిమంటల్లో ఇప్పుడు జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వులు, జీవోలు దగ్ధం చేసిన ప్రజా చైతన్యం వచ్చే ఎన్నికలలో వైసీపీకి అధికారాన్ని దూరం చేయడం తథ్యమని అంటున్నారు.
ఇక మందడంలో జరిగిన భోగి వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి పాల్గొన్న చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. సైకో పాలన అంతానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఇక ఈ రోజు నుంచి 87 రోజులలో జగన్ పాలన అంతం అవుతుందన్నారు. అంతే కాదు రాజధాని ఇక్కడే ఉంటుందనీ, ఎక్కడకూ వెళ్లదని ఈ విషయంలో తెలుగుదేశం, జనసేన భరోసా ఇస్తున్నాయనీ చెప్పారు.
గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు సంక్రాంతి పండుగ సంబరాలు లేకుండా చేసిన సైకో పాలనకు త్వరలోనే జనం చరమగీతం పాడటం ఖాయమని అన్నారు. అంగన్ వాడీలు, నిరుద్యోగ యువత ఇలా ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు అండగా నిలుస్తాయని చెప్పారు. ఇప్పుడు చీకటి జీవోలను మంటల్లో వేశామని వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని పిలుపు నిచ్చారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చినట్లుగా జనం ఓటేశారన్నారు. ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి పోలీసులు రాక్షసుల్లా వ్యవహరించారన్నారు. ఇదే పోలీసులు మీకు జిందాబాద్ కొట్టే పరిస్థితి వస్తుందన్నారు.
అలాగే పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడను మంటల్లో తగులబెట్టామనీ, వచ్చే సంక్రాంతిని తెలుగుదేశం, జనసేన సర్కార్ హయాంలో ఘనంగా జరుపుకుంటామని చెప్పారు. తెలుగుదేశం, జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదని ఎన్నో కుట్రలు పన్నారని విమర్శించారు. మరో సారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమనీ, అలా జరగకుండా ఉండాలన్న సంకల్పంతోనే భోగిమంటలు వెలిగించామని అన్నారు.