జగన్ పై ప్రకాశం వైసీపీ నేతల దండయాత్ర?
posted on Jan 14, 2024 5:01AM
ఏపీ రాజకీయాలు కాక మీదున్న సంగతి తెలిసిందే. వైసీపీలో అసెంబ్లీ ఇంచార్జిల మార్పు వ్యవహారం ఇప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాలలో వేడి రగిలిస్తున్నది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఆ జిల్లా వైసీపీలో ప్రకాశం కనిపించడం లేదు. ,చీకట్లు కమ్ముకున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒకటి తలిస్తే ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు మరొకటి తలచారు. దీంతో ఈ జిల్లా వైసీపీలో ముసలం పుట్టింది. అధిష్టానం నిర్ణయాలను పూచిక పుల్ల కింద జమకట్టేస్తున్న ఈ జిల్లా వైసీపీ నేతలు జగన్ కు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని సృష్టించి దెబ్బకొడుతున్నారు. ఇన్ చార్జిల మార్పుకు ససేమీరా అంటున్న ఈ జిల్లా నేతలు ఎవరొచ్చి చెప్పినా మా నిర్ణయం ఇదేనంటూ అధిష్టానం పంపిన దూతలను కూడా లెక్క చేయడం లేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రమంతా ఉమ్మడి ప్రకాశం జిల్లా వైపు చూస్తుంది. అసలు ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతోంది? జగన్ నిర్ణయాలను ఇక్కడి నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు చివరికి జగన్ వెనక్కి తగ్గుతారా లేకా ప్రకాశం వైసీపీ నేతలే ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది.
గురువారం(జనవరి 12) వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పు మూడో జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలోనూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఖరారు కాలేదు. మాగుంట కోసం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని మొదటి నుండి పట్టుబడుతున్నారు. తన సీటుతో పాటు మాగుంట సీటు బాధ్యత కూడా బాలినేనే తీసుకున్నారు. ఇదే విషయంపై బాలినేని ఆ మధ్యే సీఎంవోకు వెళ్లి, ఐప్యాక్ టీమ్‌ను కలిసి కూడా చర్చించారు. ఆ తర్వాత బాలినేని ఒంగోలు అసెంబ్లీ, మాగుంటకు ఒంగోలు ఎంపీ సీటు ఫైనల్ అని ప్రచారం సాగింది. కానీ, మూడవ జాబితాలో మాగుంట పేరు లేదు. అలాగే బాలినేని స్థానం కూడా అనుమానమేనని అర్ధమైంది. పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ జగన్ తో భేటీ అయ్యారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని రవిశంకర్‌కు జగన్ సూచించినట్లు ప్రచారం మొదలైంది. మరోవైపు హైదరాబాద్‌లో బాలినేనితో తిరుపతి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. తాను ఒంగోలు ఎంపీగా పోటీకి చేస్తానని మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. దీంతో బాలినేని మరోసారి జగన్ పై గరం గరం అవుతున్నారు.
అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని కంచుకోటగా మలచుకున్న మాజీ మంత్రి, సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డికి కూడా ఈసారి టికెట్ లేనట్లేని ప్రచారం జరుగుతున్నది. కందుకూరు ఎమ్మెల్యే సీటును బీసీ నేత రామారావు యాదవ్‌కు ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా జగన్ ను రామారావు యాదవ్ కలవడం, కందుకూరులో రామారావు అనుచరులు పని మొదలు పెట్టడంతో మహీధర్ రెడ్డికి ఈసారి మొండి చేయనని నిర్ధారణ అయిపోయింది. అయితే, మహీధర్ రెడ్డి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. ఆయన మీడియా సమావేశం పెట్టి టికెట్ దక్కకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. అలాగే తెలుగుదేశంలో చేరతానన్న ప్రచారాన్ని ఖండించ లేదు. ఒక్క ఒంగోలు, కందుకూరు మాత్రమే కాదు.. మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలోనే అధిష్టానానికి తీవ్ర వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజాగా శుక్రవారం ఒంగోలులోని విష్ణుప్రియా కళ్యాణ మండలంలో సంతనూతలపాడు నియోజవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా పట్టించుకోలేదు. ఇక, జిల్లాలో అన్నీ తానై నడిపించే బాలినేని కనిపించలేదు. అలాగే ఆయన వర్గం నేతలు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యేలు మానుగుంట మహీధర్ రెడ్డి, కరణం బలరాం, అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. అలాగే యర్రగొండపాలెం నియోజకవర్గానికి నూతనంగా వచ్చిన ఇన్ చార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ మార్కాపురంలోని ఓ హోటల్లో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కానీ, ముఖ్య నాయకులు ఎవరూ హాజరుకాలేదు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి ఆదిములపు సురేష్ లేకుండానే ఈ సమావేశం నిర్వహించగా.. ఆయన వర్గం ఈ సమావేశాన్ని బాయికాట్ చేశారు. మంత్రి ఆదిమూలపు కొండెపికి పరిచయ కార్యకమంలో కూడా చెప్పుకోదగ్గ పేరున్న నేతలెవరూ కనిపించలేదు.
మొత్తంగా జిల్లా పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు, జగన్ నిర్ణయాలతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలినేని.. తన తనయుడుతో కలిసి హైదరాబాద్ వెళ్లి ఓ థియేటర్లో పాప్ కార్న్ తింటూ 'గుంటూరు కారం' సినిమాను వీక్షిస్తున్న దృ శ్యాలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు విజయసాయి రెడ్డి లాంటి వారు జిల్లాలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటే.. ఎమ్మెల్యేలు మాత్రం సొంత పనులలో బిజీగా ఉన్నారు. బాలినేని లాంటి వారు జగన్ తో సంప్రదింపులు జరపాలని రెండు రోజుల పాటు సీఎంఓ చుట్టూ తిరిగినా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో అందరూ మూకుమ్మడిగా అధిష్టానంపై దండయాత్రకు దిగినట్లు కనిపిస్తున్నది. అయితే జగన్ మాత్రం నచ్చింది చేసుకుపోతూ కొత్త ఇన్ చార్జిలను నియోజకవర్గాలకు పంపుతూ తన మార్క్ మొండి వైఖరిని చాటుకుంటున్నారు. జగన్ ఈ వైఖరి కారణంగా ప్రకాశం జిల్లాలో వైసీపీ భారీ ముల్యం చెల్లించుకోక తప్పదని పరిశీలకులు అంటున్నారు.