పద్యాల పడవ కట్టిన వేమన!!
posted on Feb 19, 2022 @ 9:30AM
ప్రతి మనిషి చిన్నతనం నుండి పెద్దయ్యేలోపు పది వేమన పద్యాలైనా పలికి ఉంటాడు. ఒక్క వేమన పద్యాన్ని అయినా కంఠతా చెప్పేయగలిగేలా నేర్చుకుని ఉంటాడు. ఆ పద్యాలు అన్నీ ప్రపంచంలో ప్రతి మనిషికి, మనిషి జీవితంలో వ్యక్తిత్వాలకు దగ్గరగా…. ఎన్నో విలువలు, నీతి, ఛలోక్తులు నింపుకున్నవి వేమన పద్యాలు.
17 వ శతాబ్దానికి చెందిన పద్య కవి వేమన. ఈయన శతక కవులలో ప్రసిద్ధి చెందినవాడు. అంతేకాదు ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా పద్యాలను మలచి ప్రజాకవిగా పేరు పొందాడు. ఎలాంటి ఆడంబరాలు ఈయన పద్యాల్లో కనిపించవు. నీతిని, సామాజిక చైతన్యాన్ని ఎంతో సహజమైన పదాలతో నింపి పద్యాల రూపంలో ప్రజలకు అందించాడు. ఈయన పద్యాలు సాహిత్యపరమైన సంపదగా కాక ప్రజల జీవితంలో భాగంగా మారిపోయినవే ఎక్కువ. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో సాగే ఈయన పద్యాల పడవ సమాజపు సముద్రాన్ని ఎంతో చక్కగా చుట్టేస్తుంది.
ఎవరీ వేమన!!
"బెదమ కోమటి పెదవేమారెడ్డి, బెదమ కోమటి చినవేమారెడ్డి" అనే ఇద్దరు అన్నదమ్ములలో చినవేమారెడ్డినే వేమనగా రూపాంతరం చెందాడు. ఈయన గొప్ప ధీరుడు. ఈయన అన్న పెదవేమారెడ్డి రాయలసీమను పాలించిన నాటి రాజుగా ఉన్నా రాజ్య కార్యకలాపాలు అన్నీ చినవేమారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగేవి. ఇలా ఈయన ఒక మంచి సంపన్న కుటుంబంలోని వాడే అని స్పష్టమవుతుంది.
రూపాంతర రహస్యం!!
పాఠ్యపుస్తకాలలో వేమన పద్యాలు చదువుకున్న పిల్లలకు దిగంబరంగా ఒక కాలు మడిచి మరొక కాలు చాపుకుని కూర్చున్న వేమన భంగిమ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వేమన చిత్రాలు ఇలాగే ఉంటాయి కూడా. అయితే సంపన్న కుటుంబంలో ఉన్న వేమన ఇలా బైరాగిగా మారి సర్వమూ త్యజించిన వాడిగా ఎందుకు మారిపోయాడు అనేది తెలియదు.
చరిత్రలో తొంగి చూస్తే భోగవిలాసాలలో మునిగి ఒకానొక నిర్లక్ష్య జీవితాలకు అలవడినవాళ్ళు ఎందరో క్రమానుగతంలో గొప్ప యోగులుగానూ, తాత్వికులుగానూ రూపాంతరం చెందారని సాక్ష్యాలున్నాయి. అలాంటి కోవలోకి చెందినవారే వేమన కూడా.
వేశ్యలోలుడి నుండి యోగిగా!!
ఈయనను, ఈయన అన్నను చంపితే రాజ్యానికి తనే రాజు అవ్వచ్చనే నమ్మకద్రోహానికి కంకణం కట్టుకున్న మంత్రి చినవేమారెడ్డికి ఉన్న వేశ్యల సంపర్కమనే బలహీనతతో ఆవిపు దారి మళ్లించి విషప్రయోగం చేసి చివరకు అడవుల్లో పడేసివస్తే, శరీరంలోం ఏ మూలో, ఏ నాడీ కణంలోనో కొనఊపిరి ఉందని గమనించి అభిరామ అనే ఒక వైద్యుడు ఔషధాల సహాయంతో పడనాన్ని నిలబడితే తిరిగి పునర్జన్మ పొంది జరిగింది గుర్తుచేసుకుంటూ ఎంతటి తప్పు చేసానో అనే పశ్చాత్తాపంతో మౌనంగా మారిపోయిన చినవేమారెడ్డి కాలక్రమంలో అభిరామ గురువు అయిన విశ్వకర్మ భోదించే జ్ఞానానికి పాత్రుడయ్యి ఆ జ్ఞానాన్ని నింపుకుని వేమన యోగిగా రూపాంతరం చెందాడు.
పద్యాల పడవకు బ్రౌన్ వెలుగు!!
నిజానికి మొదట వేమన పద్యాలు అన్నీ ప్రజల నోటి మాటల్లో నానాయి. వాటిని వేమన ఏవిధంగానో గ్రంథస్థం చేయడం కానీ, ఇతరులు ఎవరూ గ్రంథస్థం చేయించడం కానీ జరగలేదు. అయితే తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన తెల్లదొర బ్రౌన్ వేమన పద్యాలను గ్రంథస్థం చేయించడమే కాకుండా వాటిని ఆంగ్లంలోకి అనువదించారు కూడా.
అనగనననగరాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు…… అని చెప్పిన మన వేమన,
తనువులోన నున్న తత్త్వంబు దెలియక
వేరే యాత్ర బోవు వెర్రివాడు
గంత మోసి మోసి గాడిద తిరుగదా….. అని కూడా అంటాడు.
ఇందులో ఎంతో తత్వం ఉంది. అలాగే
ఆత్మ శుద్దిలేని ఆచార మది యేల?? అంటూ ప్రశ్నిస్తాడు.
అన్నిధానముల కంటే అన్నదానము మేలు అని చెబుతాడు….
ఉర్విజనులకెల్ల ఒక్క కంచము బెట్టి అని సర్వసమానతను సమర్ధిస్తాడు…..
జీవిజీవిని జంప శివుని జంపుటే అగు అని ఆయనలో ఉన్న జీవకారుణ్యాన్ని బహిర్గతం చేస్తాడు.
ఇలా వేమన యోగిగా మారి ఎన్నో ఊళ్ళు తిరుగుతూ వెళ్లిన ప్రతిచోటా తన పద్యాల గుభాళింపును వెదజల్లాడు. ఆ పరిమళమే ఇప్పటికీ అందరికీ నీతి పద్యాల ప్రసాదమై నాల్కలకు తియ్యదనాన్ని పంచుతూ ఉంది అనుకోవచ్చు.
వేమనను ఇలా గుర్తుచేసుకోవడమే కాదు, ఆయన పద్యాలను ఆయన చెప్పిన నీతిని పిల్లలకు కూడా నేర్పించాలి.
◆ వెంకటేష్ పువ్వాడ