వర్షాభోంస్లే కాల్చుకున్న రివాల్వర్ ఎవరిది?
posted on Oct 10, 2012 @ 3:57PM
ప్రముఖ గాయని ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హఠాత్ పరిణామానికి కుటుంబం మొత్తం నివ్వెరపోయింది. వర్షా తల్లితోపాటు పెద్దమ్మ లతా మంగేష్కర్ కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. కానీ.. ఆత్మహత్యచేసుకోవడానికి వర్ష ఉపయోగించిన తుపాకీ ఎవరిదన్న విషయం మాత్రం మిస్టరీగానే ఉంది. బెల్జియంలో తయారైన 0.6 కాలిబర్ పిస్టల్ ఎవరిదన్న ప్రశ్న ఇంకా పోలీసుల బుర్రల్ని తొలుస్తూనే ఉంది. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం వర్ష కొద్ది రోజులుగా తీవ్ర మైన డిప్రెషన్ లో కూరుకుపోయి వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకుంటోంది. ప్రభుకుంజ్ లోని ఆషాభోంస్లే ఇంట్లో సోఫాలో వేలాడుతూ వర్షా భోంస్లే శవం కనిపించింది. ఇంట్లో ఉన్న వాళ్లలో ఎవరూ వర్ష ఉపయోగించిన తుపాకీకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ముందుకురాలేదు. ఉషామంగేష్కర్, దగ్గరి బంధువు రచనా షా, డ్రైవర్ విజయ్, పనిమనిషి రూపాలీల స్టేట్ మెంట్లని పోలీసులు రికార్డ్ చేశారు. బుల్లెట్ దూసుకుపోవడంవల్ల మెదడు దెబ్బతినడం, బాగా రక్తం కారిపోవడంవల్ల వర్షా చనిపోయిందని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో ఉంది. గతంలోకూడా వర్ష రెండుసార్లు ఇలా ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.