ఢిల్లీలో డి.కె.అరుణ తెలంగానం
posted on Oct 10, 2012 @ 3:42PM
తెలంగాణ విషయంలో మహబూబ్ నగర్ జిల్లా వాసుల సత్తాని చూపించేందుకు మంత్రి డి.కె.అరుణ రెడీ అవుతున్నారు. జిల్లా తరఫున ఓ ప్రత్యేక బృందాన్ని తీసుకుని హస్తినకు వెళ్లి పరోక్ష బలప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాకి చెందిన ముఖ్యనేతలంతా అరుణ వెనకాలే నడుస్తూ ఢిల్లీ పెద్దలకు తీవ్రస్థాయిలో నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధపడుతున్నారు. అక్టోబర్ మూడోవారంలో తెలంగాణ మంత్రులంతా కలిసి ఢిల్లీకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని బసవరాజు సారయ్య వెల్లడించారు. బయోడైవర్సిటీ సదస్సుకోసం హైదరాబాద్ వస్తున్న ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఓ బృందంగా ఏర్పడి తెలంగాణ మంత్రులంతా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంపై ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఒత్తిడి తీసుకురావాలన్నది డి.కె.అరుణ టీమ్ ఆలోచనగా కనిపిస్తోందని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. డి.కె.అరుణ ఆధ్వర్యంలో ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం ప్రయాణమవుతున్న విషయాన్ని ఎఐసిసి జనరల్ సెక్రటరీ ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా ధృవీకరించారు. తెలంగాణ విషయంలో ఇప్పటికే టిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో మంతనాలు జరిపానని, ఆయన చెప్పిన విషయాలన్నీ సోనియాగాంధీకి నివేదించానని ఆస్కార్ ఫెర్నాండెజ్ చెబుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ ని, ఎఐసిసి జనరల్ సెక్రటరీ ఆస్కార్ ఫెర్నాండెజ్ ని, కేంద్ర హోంమంత్రి సుసీల్ కుమార్ షిండేని కలిసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో మంతనాలు జరపాలని డి.కె.అరుణ బృందం భావిస్తోంది.