వంగవీటిపై రెక్కీ చేసింది అతనేనా? బెజవాడలో అసలేం జరుగుతోంది?
posted on Dec 29, 2021 @ 11:22AM
చాలాకాలంగా బెజవాడ పాలిటిక్స్ స్తబ్దుగా ఉన్నాయ్. ప్రశాంత చెరువులో రాయి వేసినట్టు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా అలజడి. గంటల వ్యవధిలోనే హైటెన్షన్. తనపై రెక్కీ చేశారని వంగవీటి రాధ వైసీపీ నేతల సమక్షంలో ప్రకటించడం కలకలం రేపాయి. వెంటనే సీఎం జగన్ స్పందించి విచారణకు ఆదేశించడం.. వంగవీటికి 2+2 గన్‌మెన్లు ఇవ్వడం.. ఆయన వాటిని తిరస్కరించడం.. చంద్రబాబు సైతం డీజీపీకి లేఖ రాయడం.. ఇలా వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఒక్క స్టేట్‌మెంట్‌తో ఓవర్‌నైట్ వంగవీటి రాధాకృష్ణ సంచలనంగా మారారు. కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్న ఆయన.. సడెన్‌గా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. రాజకీయంగా సెంటర్ పాయింట్‌గా నిలిచారు. ఇంతటి పొలిటికల్ మసాలాకు కారణం.. తనపై రెక్కీ జరిగినట్టు వంగవీటి ప్రకటించడం. ఇంతకీ.. రాధాపై రెక్కీ చేసింది ఎవరు? వంగవీటిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కొడాలి నాని, వంశీల సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం వ్యూహాత్మకమా? ఇదంతా వైసీపీ స్కెచ్చా? టీడీపీ నేత వంగవీటిపై జగన్‌కు సడెన్‌గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? రెక్కీ వెనుకున్న రాజకీయం ఏంటి? కాపులను కాపు కాస్తున్నది ఎవరు? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్.
వంగవీటిపై రెక్కీ అంటే వెంటనే అందరి దృష్టి దేవినేని వైపే మళ్లడం కామన్. ఇప్పుడు సైతం దేవినేని వర్గాన్నే అనుమానిస్తున్నారు అంతా. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయనతో టీడీపీ లీడర్లు ఎవరికీ ఎలాంటి శత్రుత్వం లేదు. ఆ లెక్కన వంగవీటిపై రెక్కీ చేయాల్సిన అవసరం టీడీపీకి గానీ, ఆ పార్టీ లీడర్లకు కానీ లేనే లేదు. అందుకే అనుమానమంతా వైసీపీ వారిమీదే. అందులోనూ దేవినేని అవినాశ్ వైపే. తనకు గాలం వేయాలని భావించిన కొడాలి నాని, వల్లభనేని వంశీలకు చెక్ పెట్టేందుకే.. వారి సమక్షంలోనే కావాలనే రెక్కీ విషయం బయటపెట్టారని అంటున్నారు. "మీరేమో పార్టీలోకి లాగాలని చూస్తున్నారు.. మరి, మీ పార్టీ నాయకులేమో నన్ను చంపాలని చూస్తున్నారు".. అనే మెసేజ్ ఇచ్చేందుకే ఇలా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. వంగవీటి ప్రకటనతో వైసీపీకి జరిగే డ్యామేజ్‌ను గుర్తించే సీఎం జగన్ సైతం వెంటనే రియాక్ట్ అయ్యారని.. తమ వారిపై అనుమానం రాకుండా ఉండేందుకే.. గంటల వ్యవధిలోనే గన్‌మెన్లను కూడా కేటాయించారని అంటున్నారు. టీడీపీ నేతలపై కుట్రలు చేసి కేసులు పెట్టి వేధించే వైసీపీ ప్రభుత్వం.. వంగవీటి విషయంలో మాత్రం ఇంత పాజిటివ్ గా క్విక్ రెస్పాన్స్ ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం, దురుద్దేశం తెలియంది కాదు. జగన్ స్ట్రాటజీని పసిగట్టిన వంగవీటి.. తనకు ప్రజాబలం చాలని.. గన్‌మెన్ల అవసరం లేదంటూ వారిని తిప్పిపంపి.. జగన్‌కు రాధాకృష్ణ జబర్దస్త్ ఝలక్ ఇచ్చారని చెబుతున్నారు. వెంటనే చంద్రబాబు సైతం జోక్యం చేసుకొని.. వంగవీటి భద్రత తమకు, తమ పార్టీకి అత్యంత ముఖ్యమని.. గన్‌మెన్లను తీసుకోమని రాధాకు సూచించారు. ఇలా బెజవాడలో వంగవీటి పొలిటికల్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతోంది. ఇదంతా సరే.. ఇంతకీ వంగవీటిపై రెక్కీ చేసింది ఎవరు? దేవినేని అవినాశ్‌కు లింకుందా? బెజవాడలో అసలేం జరుగుతోంది?
వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ చేసింది.. దేవినేనికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ వెంకట సత్యనారాయణ...అని బెజవాడలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దేవినేని అవినాశ్ డైరెక్షన్లోనే సత్యం రెక్కీ చేశారంటూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిప్పులేనిదే పొగ రాదుగా! ఏదో జరిగే ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. వంగవీటి రెక్కీ ఆరోపణలు చేసిన వెంటనే పోలీసులు వెంకట సత్యాన్ని అదుపులోకి తీసుకున్నారని.. విచారణలో ఖాకీలు చితక్కొట్టడంతో.. సత్యం అపస్మారకస్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చేరారనే ప్రచారం బెజవాడలో కలకలం రేపింది. అయితే, ఈ ఆరోపణలను వెంకట సత్యనారాయణ కుమారుడు చరణ్ ఖండిస్తున్నారు. తన తండ్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. బెజవాడ లోకల్ టాక్ ఎలా ఉన్నా.. వంగవీటిపై రెక్కీ చేసే అవసరం.. వైసీపీ గ్రూపులకు గానీ, దేవినేని వర్గానికి గానీ మాత్రమే ఉంటుందని.. ఇతరులెవరికీ వంగవీటిని చంపాల్సినంత అవసరం ఉండదని బెజవాడ గొడవల గురించి తెలిసివారంతా అంటున్నారు.
మరోవైపు.. రెండు నెలల క్రితం వంగవీటి చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. అప్పడు ఖమ్మం జిల్లా కొత్తపాలెం గ్రామంలో జరిగిన రంగా విగ్రహావిష్కరణలో వంగవీటి మాట్లాడుతూ.. "ఐకమత్యమే మన బలం.. ఉన్నవాళ్లనైనా ఆవేశంతో, ఆలోచనతో కాపాడుకోవాలి" అని పిలుపునిచ్చారు. ఆనాడు చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగానే, తన హత్యకు కుట్ర జరుగుతోందని తాజాగా రంగా వర్ధంతి సందర్భంగా రాధా స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. ఏపీలో జనాభా పరంగానే కాకుండా అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించేందుకు వంగవీటి రాధాకృష్ణ రెడీ అయ్యారని.. అందులో భాగంగానే పొలిటికల్ అటెన్షన్ తనవైపు డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. కారణం, రాజకీయం ఏదైనా.. వంగవీటి రాధా రెక్కీ ఆరోపణలు మాత్రం బెజవాడను మరోసారి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. విజయవాడ పాలిటిక్స్ మళ్లీ హాట్ హాట్‌గా మారాయి.