ప్రజల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమా కేసీఆర్!
posted on Dec 29, 2021 @ 11:17AM
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు 7 వందలు దాటేశాయి. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో వైరస్ మరింతగా విస్తరించే అవకాశం ఉండటంతో కఠిన ఆంక్షలు విధించాయి. చాలా రాష్ట్రాలు డిసెంబర్ 31, జనవరి1న ఆంక్షలు విధించాయి. న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశాయి. ఢిల్లీ సర్కార్ ఏకంగా సినిమా థియేటర్లు, స్కూళ్లను బంద్ చేసింది. మాల్స్, వైన్స్ ను సరి-బేసి విధానంలో అనుమతి ఇస్తోంది. రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ లో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. కేరళ సర్కార్ కూడా న్యూఇయర్ వేడుకలపై నిఘా పెట్టింది.
అయితే దేశంలో ఒమిక్రాన్ కేసుల్లో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ సర్కార్ మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మిగితా రాష్ట్రాలు డిసెంబర్ 31న జనాలు రోడ్లపై రాకుండా ఆంక్షలు విధిస్తే.. తెలంగాణ సర్కార్ మాత్రం అంతా గుమిగూడేలా చర్యలు తీసుకుంది. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాల వేళలు పొడిగించింది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబరు 31న.. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చేసింది. 31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు న్యూఇయర్ ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయనుంది.
అర్థరాత్రి అందరికీ హ్యాపీ న్యూఇయర్ చెప్పేవరకూ.. ఫుల్‌గా తాగొచ్చు. తాగినోళ్లకి తాగినంత మందు అందుబాటులో ఉంచడమే కేసీఆర్ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. దీనిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందని జనాలు మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమైన్నట్లుగా ఉందని ఆరోపిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందంటూ ఆయన ట్వీట్ చేశారు.