యూపీ ఎలక్షన్స్ 2022.. బ్రాహ్మణ ఓటు కమలం కొంప ముంచుతుందా?
posted on Dec 29, 2021 @ 11:32AM
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తధ్యమని సర్వేలు సూచిస్తున్నాయి.అయితే బీజేపీ,నాయకత్వం మాత్రం భయపడుతోంది. ఓటమి భయంతోనే పరుగులు తీస్తోంది. ముఖ్యంగా బ్రాహ్మణ ఓటు అటూ ఇటూ అయితే, లెక్క తప్పుతుందని బీజేపే నాయకత్వం కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించింది.ఒక విధంగా బీజీపీ అగ్ర నాయకత్వాన్ని బ్రాహ్మణ ఓటు బ్యాంకు చేజారిపోతోందనే భయం వెంటాడుతోంది ఈ భయంతోనే బీజేపీ నాయకులు కిందామీద అవుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం, 1990 దశకంలో మండల్ – కమండల్ ఆందోళనల నేపధ్యంగా కమల దళం వైపు మొగ్గు చూపడం మొదలైంది.ఆ తర్వాతనే రాష్ట్రంలో బీజేపీకి పునాదులు ఏర్పడ్డాయి. ఆ పునాదుల ఆధారంగానే 1990వ దశకంలో బీజేపీకి నాలుగుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. అయినా, బీజేపీ ఒక్కాసరి కూడా ముఖ్యమంత్రి పదవిని బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. రెండు సార్లు బీసీవర్గానికి చెందిన కళ్యాణ్ సింగ్’ను ముఖ్యమంత్రిని చేసింది. మరోమారు వైశ్య వర్గానికి చెందిన రాంప్రకాష్ గుప్తాను, ఇంకోసారి రాజ్‌పుత్ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్’ను ముఖ్యమంత్రిని చేసింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండి చేయి చూపించింది.
ఈ నేపధ్యంలో 2005లో మాయావతి, నూతన సామాజిక సమీకరణ ప్రయోగం చేశారు. దళిత బ్రాహ్మణ కూటమిని తెర మీదకు తెచ్చారు. ఆ ప్రయోగం సక్సెస్ అయింది. మాయ చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఫలితంగా 2007 ఎన్నికలలో బీఎస్పీ ఘనవిజయం సాధించింది. సంపూర్ణ మెజారిటీతో మాయావతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అయితే మాయావతి స్వయం కృతం కారణంగా, ఆమె చేసిన సోషల్ ఇంజినీరింగ్ ప్రయోగం విఫలమైంది. 2012లో సమాజ్‌వాదీ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.ఇక 2017 లోకి వస్తే, 2014 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ వేవ్’లో యూపీ బ్రాహ్మణులు మరోసారి బీజేపీకి మద్దతు ఇచ్చారు. బ్రాహ్మణ ఓటు బ్యాంక్ సాలిడ్’గా కమలదళం వైపు మొగ్గు చూపింది. అందు వల్లనే, 2014లోక్ సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ యూపీని స్వీప్ చేసింది. అయితే, బ్రాహ్మణేతర సామాజిక వర్గానికి చెందిన యోగీ అదిత్యనాథ్’ను సీఎం చేసి, కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు , బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దినేష్ శర్మను డిప్యూటీ సీఎం చేసి బ్రాహ్మణులను సంతోషపెట్టాలని ప్రయత్నించింది.
అయితే గడచిన ఐదేళ్లలో, యోగీ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదనే బావన ఆ సామజిక వర్గం వుంది. అందుకే 2017 ఎన్నికల్లో బీజీపీ వైపు సాలిడ్’గా నిలించిన బ్రాహ్మణ సామాజిక వర్గం, ఈసారి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్’ ప్రభుత్వ పట్ల గుర్రుగా ఉన్నారు. అందుకు చాలానే కారణాలున్నా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలుచాలా బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి యోగి ఆదిత్యనాథ్’ ప్రభుత్వంలో, మంత్రి వర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సముచిత స్థానమే లభించింది, ప్రభుత్వ అధికారులలోనూ బ్రాహ్మణ సామాజిక వార్గానికి సముచిత స్థానమే దక్కింది. అయినా బ్రాహ్మణులలో, యోగి ప్రభుత్వం పట్ల అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నాయంటే, అందుకు మూలా కారణం క్రింది స్థాయిలో బ్రాహ్మణులకు సానుకూల సంకేతాలు ఇవ్వడంలో బిజెపి విఫలమైంది. మరోవైపు, బ్రాహ్మణుల ఈ అసంతృప్తిని పసిగట్టిన బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా బ్రాహ్మణ నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు బ్రాహ్మణ సమ్మేళనాలు ఏర్పటు చేసి వరాల జల్లు కురిపిస్తున్నాయి.
మరో వంక బీజేపీలోని సీనియర్ బ్రాహ్మణ నాయకులు ప్రత్యేకంగా సమావేసమై,తమ వర్గానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెరిగే విధంగా, ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే, తమకు పట్టున్న నియోజక వర్గాల్లో ఇతర సామాజిక వర్గాలను నిలబెడితే సహించేంది లేదని అంటున్నారు. బీజేపీ నాయకత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని లేదంటే తమ దారి తాము చుసుకుంటామని హెచ్చరించారు.బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగెస్టర్(గూండా)వికాస్ దుబే, ఆయన అనచరుల ఎన్కౌంటర్’ను కూడా బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి ఒక కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రింది స్థాయిలో దుబే ఎన్కౌంటర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే, దుబే ఎన్కౌంటర్’ను నేతలు ప్రశ్నిస్తున్నారు. సుల్తాన్ పూర్ ఎమ్మెల్యే దియోమణి ద్వివేది, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బ్రాహ్మలు హత్యకు గురయ్యారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో అసంతృప్తిని చల్లార్చేందుకు లఖిం పూర్ ఖేదీ ఎంపీ అజయ్ కుమార్ మిశ్రాను కేంద్రంలో, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదాను రాష్ట్రంలో యోగీ మంత్రి వర్గం లోకి తీసుకున్నారు. అంతే కాదు, లఖింపూర్ ఖేరీ సంఘటనకు సంబంధించి మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలిగించాలని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో డిమండ్ చేస్తున్నా,ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదు. అంటే బీజేపీ నాయకత్వంపై బ్రాహ్మణ నాయకుల వత్తిడికి ఎంత బలంగా పనిచేస్తోందో, అర్థం చేసుకోవచ్చును, అంటున్నారు, పరిశీలకులు.
ఈనేపధ్యంలోనే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది.బ్రాహ్మణ నాయకులను బుజ్జగించేందుకు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా ఒక కమిటీనే ఏర్పాటు చేశారు.
అంతకు ముందు కేంద్ర మంత్రి, యూపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్రంలోని పార్టీ బ్రాహ్మణ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అయితే, బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి శివ ప్రతాప్ శుక్లా బ్రాహ్మణులకు పార్టీపై కోపం లేదని, దిద్దుబాటు చర్యలకు ఇంకు సమయముందని అంటున్నారు. పార్టీ నాయకత్వం సకాలంలో సరియైన నిర్ణయం తీసుకుంటే, సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం అవుతుందని, నాయకత్వం ఉపేక్ష వహిస్తే మాత్రం ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలే అవకాశాన్ని కొట్టివేయలేమని అన్నారు. మరో వంక, ప్రస్తుతానకి, అసంతృప్తి దశలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఆగ్రహంగా మారితే మాత్రం ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు కూడా పరిస్తితిని విశ్లేషిస్తున్నారు.