14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. ఆపై సెంచరీ.. వైభవ్ సూర్యవంశి ఓ అద్భుతం
posted on Apr 28, 2025 @ 11:24PM
రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. 209 పరుగులను ఇంకా 4.1 ఓవర్లు ఉండగానే ఛేదించింది. వరుస పరాజయాలతో కునారిల్లి ఉన్న జట్టు ఇంత వరకూ ఛేదనలో తడబడుతూ వచ్చింది. అయితే సోమవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కొండంత లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేశింది. అయితే ఈ ఛేదన ఇంత సునాయాసం కావడానికి కారణం మాత్రం వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. వైభవ్ సూర్య వంశీ కూడా 14 ఏళ్ల పిన్న వయస్సులోనే ఐపీఎల్ లో అరంగేట్రం చేశారు. అలా ఐపీఎల్ లో ఆడిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అయతే అక్కడితో ఆగిపోలేదు. ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాది ఔరా అనిపించాడు. ఇప్పుడు సోమవారం ( ఏప్రిల్ 29) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఐపీఎల్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతేనా ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. వైభవ్ సూర్యవంశి 35 బంతుల్లో 11 సిక్స్ లు, 7 ఫోర్లతో సెంచరీ చేశాడు.
సరే ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 201 పరుగుల విజయలక్ష్యాన్ని 14.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించేసి విజయాన్ని అందుకుంది. ఆర్ ఆర్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశి 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లలో 70 నాటౌట్ చెలరేగి ఆడారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది.