చిరిగిన జీన్స్.. యువతిపై సీఎం షాకింగ్ కామెంట్స్
posted on Mar 17, 2021 @ 4:50PM
యువతులు చిరిగిన జీన్స్ వేసుకోవడం తప్పా? ముమ్మాటికీ తప్పే. అవి లై*గిక వేధింపుల వైపు మళ్లే ప్రమాదం ఉంది. ఈ మాట అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కానే కాదు. సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అన్నారు. పాశ్చాత్యులు మనల్ని అనుసరిస్తూ యోగా చేస్తూ, పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటుంటే.. మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని ఉత్తరాఖండ్ సీఎం తీరథ్‌సింగ్ రావత్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.
యువతుల వస్త్రధారణ విషయంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా. ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే.. సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు? మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు? ఇదంతా ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మనం ఏం చేస్తామో పిల్లులూ అదే చేస్తారు. మనం దేనిని ఫాలో అవుతామో... పిల్లలూ అదే ఫాలో అవుతారు. ఇళ్లలో సంస్కృతి మూలాలను నేర్పించినట్లైతే, ఎంత ఆధునికంగా ఉన్నా పర్లేదు. జీవితంలో ఎన్నడూ వైఫల్యం చెందరు.’’ అని సీఎం తీరథ్ రావత్ అన్నారు. ఈ పోకడలు లైంగిక వేధింపులు వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు. యువతులు చిరిగిన జీన్స్ వేసుకోవడం తప్పు అన్నట్టు సీఎం చేసిన కామెంట్లపై మహిళా లోకం భగ్గుమంటోంది.