ఆధారాలిస్తా.... బాబుకు ఇచ్చిన నోటీసులే సీఎంకు కూడా ఇవ్వండి
posted on Mar 17, 2021 @ 5:03PM
ఏపీలో అమరావతి అస్సైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇవ్వడంపై రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. రాష్ట్రంలోని జగన్ సర్కార్ ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని టీడీపీ విరుచుకుపడుతోంది. మరోపక్క వైసిపి నేతలు మాత్రం బాబు సిఐడి విచారణకు హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చెపుతున్నారు.
ఇది ఇలా ఉండగా అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇచ్చిన నోటీసులే సీఎం జగన్‌కు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో పేదలైన దళితుల నుండి అతికిరాతకంగా, బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లను జగన్‌తో పాటు రెవిన్యూ మంత్రి, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ల పైనా పెట్టి నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.దళితుల నుండి సీఎం అసైన్డ్ భూములను లాక్కున్న వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో తాను సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ఒకవేళ సీఐడీ అధికారులు జగన్‌పై కనుక కేసులు పెట్టకపోతే సీఐడీ అధికారులపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని హర్షకుమార్ హెచ్చరించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిలు గతంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను సీఎం జగన్ బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం కోసం దళితులను బలిపశువులుగా చేసిన జగన్‌కు జోహార్లు అంటూ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.