జేసీ కేసీఆర్ కోవర్ట్!
posted on Mar 17, 2021 @ 4:29PM
జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరే పెద్ద బ్రాండ్. ఏపీ మాజీ మంత్రి, అనంతపురం మాజీ ఎంపీ జేసీ.. ఏం చేసినా.. ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటేనే ఏదో మసాలా ఉన్నట్లే. తాను ఏది అనుకుంటే అది మాట్లాడేయటం జేసీ స్పెషల్. తనకు ఇబ్బంది అవుతుందని తెలిసినా ఆయన వెనక్కి తగ్గరు. కొన్ని సార్లు సొంత మనుషులనే టార్గెట్ చేస్తారు.. సొంత పార్టీపైనా తాను తప్పు అనుకుంటే వెంటనే చెప్పేస్తారు.
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత జేసీ ఫ్యామిలీ ఇక్కట్లు పడుతోంది. అయినా తన తీరు మార్చుకోవడం లేదు జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో పంచ్ లు విసురుతూనే ఉన్నారు. మా వాడు అంటూనే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఏపీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ ఇప్పుడు కాక రేపుతున్నారు జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ.. సీఎల్పీ కార్యాలయంలో చాలా సేపు ఉన్నారు. టీకాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్, కేసీఆర్, సోనియా, రాహుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు జేసీ. ఇవే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు.
జేసీ దివాకర్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని తెలంగాణాలో కాదని ఆయన విమర్శించారు. సాగర్ ఉప ఎన్నికలలో జానారెడ్డి ఓడిపోతాడు అని చెప్పడానికి జేసీ ఎవడని ఆయన ప్రశ్నించారు. జేసీ జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని వీహెచ్ మండిపడ్డారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.
జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసీఆర్ కోవర్ట్ అని అర్థమవుతోందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. జేసీ తన రాజకీయ బలాన్ని జగన్ పైన చూపుకోవాలని సూచించారు. జేసీ దమ్మున్న లీడర్ అయితే అనంతపూర్‌లో లేదా రాయలసీమలో తన బలాన్ని చూపించుకోవాలని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ నేత మళ్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిపై అధిష్టానానికి కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోనియా, రాహుల్‌ను జేసీ తిట్టిపోసినా ఈ నేతలు అడ్డుకోలేదని విమర్శించారు. జానారెడ్డి ఓడిపోతాడని జేసీ చెప్పినా స్పందించరా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. వేరే దారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అక్కడా ఇక్కడా లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది. సాగర్‌లో జానారెడ్డి గెలువలేడు" అని జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం కామెంట్ చేశారు.