కరోనా మూలాలు తేలాల్సిందే!
posted on May 15, 2021 @ 3:28PM
ప్రపంచంలో ఇంతలా విద్వంసం,మారణకాండ సృష్టిస్తున్న,కరోనా మహమ్మరి, మూలాలు ఎక్కడున్నాయో, తెలుసుకోవలసిన అవసరం, హక్కు ప్రపంచ దేశాలకు ఉంది. అయితే, ఇంతవకు కొవిడ్ 19 వ్యాధికి మూలమైన కరోనా వైరస్ సృష్టి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది అనే విషయంలో స్పష్టత లేదు. చైనా-డబ్ల్యూహెచ్‌వో ఉమ్మడి అధ్యయన బృందం జరిపిన అధ్యయనంలోనూ స్పష్టతలేదు. నిజానికి, ఆ అనేక ప్రపంచ దేశాలు ఆధ్యయనం విశ్వసనీయత పట్ల కూడా అనుమానాలు వ్యక్త చేశారు.
ఈ నేపధ్యంలో, కొవిడ్-19 మూలాలను తేల్చడానికి మరింత పరిశోధన జరపాలని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు డిమాండ్ చేశారు. ఈ శాస్త్రవేత్తల్లో భారత సంతతికి చెందిన ఇమ్యునాలజీ, అంటువ్యాధుల నిపుణుడు రవీంద్ర గుప్తా కూడా ఉన్నారు.ఈమేరకు రాసిన లేఖలో శాస్త్రవేత్తలు, కరోనా వైరస్, చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి విడుదలై ఉంటుందన్న వాదనపైనా దృష్టి సారించాలని కోరారు. ఈమేరకు వారు రాసిన లేఖ ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది.ఇందులో వారు,పూర్తిస్థాయి డేటా లభ్యమయ్యేవరకూ ఈ వైరస్.. ల్యాబ్ నుంచి వెలువడిందన్న వాదనతోపాటు అది సహజసిద్ధంగా వచ్చి ఉంటుందన్న వాదననూ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
మరో వంక కరోనా మూలాలపై స్పష్టత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్, అమెరికా, 13 దేశాలు, యూరోపియన్ యూనియన్ వ్యక్తంచేసిన అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు లేఖలో పేర్కొన్నారు. ఈ వైరస్ మూలాలను గుర్తించేందుకు చైనా-డబ్ల్యూహెచ్‌వో ఉమ్మడి అధ్యయన బృందం జరిపిన అధ్యయనంలో, కరోనా వైరస్ సహజసిద్ధంగా వచ్చిందా లేక ల్యాబ్ నుంచి లీకైందా అన్నదానిపై ఇతమిత్థంగా ఏమీ తేలలేదని, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైనా-డబ్ల్యూహెచ్‌వో ఉమ్మడి అధ్యయన బృందం జరిపిన అధ్యయనం ఒక జంతువు నుంచి ఈ వైరస్ వచ్చి ఉండటానికే ఆస్కారం ఎక్కువగా ఉందని మాత్రమే పేర్కొంది. ల్యాబ్ ద్వారా లీకై ఉండటానికి అవకాశం దాదాపుగా లేదని తెలిపింది.
నిజానికి ఈ రెండు సిద్ధాంతాలపై సరైన పరిశీలన జరగలేదు, అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ల్యాబ్ నుంచి లీకై ఉంటుందన్న వాదనకు మద్దతునిచ్చే ఆధారాలపై సరైన అధ్యయనం జరగలేదని, ఈ కోణాన్ని బలపరిచే అదనపు వనరులను అందించడానికి తాము సిద్ధమన్న డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ వ్యాఖ్యలను వారు గుర్తుచేశారు. ఈ నేపద్యంలో అన్ని రంగాల నిపుణులతో కూడిన సమగ్ర దర్యాప్తు అవసరమని శాస్త్రవేత్తలు తమ లేఖలో పెర్కొన్నారు. నిజానికి, కొవిడ్ 19 పై ప్రపంచ దేశాలు సాగిస్తున్న యుద్ధంలో ప్రపంచ మానవాళి విజయానికి వైరస్ మూలాలు తేలడం .. మొదటి మెట్టు అవుతుందని, ఎప్పుడోనే శాస్త్ర వేత్తలు పేర్కొన్నారు.