అక్కడ నో మాస్క్.. ఇక్కడ మాస్క్ మస్ట్.. కరోనా కన్ఫ్యూజన్..
posted on May 15, 2021 @ 2:59PM
అంతటా కరోనా వైరసే. కానీ, దేశానికో తీరు విధ్వంసం. వైరస్ పుట్టిన చైనా ఇప్పుడు వర్రీ లేకుండా ఉంది. మొదట్లో కంగారు పడిన అమెరికా.. ఇప్పుడు ఆరామ్‌సే ఉంటోంది. మధ్యలో మనమే ఆగమాగం అవుతున్నాం. కరోనా మరణమృదంగంతో అల్లాడిపోతున్నాం. కోట్లల్లో కేసులు, లక్షల్లో మరణాలతో దేశం అస్థవ్యస్థంగా మారింది. వ్యాక్సిన్ ఒక్కటే వైరస్‌ను జయించే బ్రహ్మాస్త్రం. ఆ వ్యాక్సిన్ అనంతర విధానాల్లోనూ దేశానికో రకమైన రూల్. రెండు డోసుల టీకా అనంతరం.. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని అమెరికా అంటోంది. రెండు డోసులు వేసుకున్నా.. మాస్క్ తప్పనిసరి అనేది ఇండియా విధానం. అదే కరోనా, అదే వ్యాక్సిన్లు.. కానీ, దేశానికో రూలు. కరోనా వచ్చినప్పటి నుంచీ ఇలా అంతా కన్ఫ్యూజనే కన్ఫ్యూజన్. సైంటిస్టులకే సరైన క్లారిటీ లేదు. ఇక సామాన్యులు గురించి చెప్పేదేముంది.
కరోనా టీకాలు తీసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) ప్రకటించింది. కొవిడ్-19 రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే, వ్యాక్సిన్ తీసుకోకపోయినా, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందక పోయినా మాస్కు ధరించాల్సిందే. టీకా రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత మాస్కులు తీసేయవచ్చు. భౌతిక దూరం కూడా అవసరం లేదు. ప్రయాణాలకు ముందు, ఆ తర్వాత కొవిడ్ పరీక్షలు చేయించుకోనవసరం లేదు. ప్రయాణం తర్వాత క్వారంటైన్, హోంక్వారంటైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవీ.. తాజాగా అమెరికాలో అమల్లోకి వచ్చిన కొవిడ్ రిలాక్సేషన్స్.
అయితే, అమెరికా మాత్రం రెండు డోసుల టీకాలు తీసుకుంటే మాస్క్ అవసరం లేదంటుంటే.. ఇండియా మాత్రం వ్యాక్సిన్ తీసుకున్నా.. మాస్క్ మస్ట్ అంటోంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక సూచన చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే, ఏ వేరియంట్ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని.. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.
మరోవైపు, టీకా తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని ఇప్పుడప్పుడే మార్గదర్శకాల్లో చేర్చబోమని కేంద్ర ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందన్నారు. ఇంకా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగానే ఉన్న నేపథ్యంలో మాస్కులు పక్కనబెట్టడం సురక్షితం కాదని తెలిపారు.
అమెరికాలో కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్కు అవసరం లేదని ప్రకటించడంతో.. భారత్‌లోనూ అదే నిబంధన వర్తిస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియాలో మాత్రం మాస్క్ మస్ట్ అంటూ ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా తాజా సూచనలు చేశారు.