ఇక అంతా ఆన్లైన్ జగమంతా వర్చ్యువల్..
posted on May 15, 2021 @ 3:28PM
అప్పుడు అంతా ఆన్ లైన్. చదువులు ఆన్లైన్ ... ఉద్యోగాలు ఆన్లైన్ (వర్క్ ఫ్రమ్ హోం), కొతిమేర కట్ట నుంచి నిత్యావసర సరుకులు, ఇంకా ఏదైనా విలాస, వినోద వస్తువులు ఏది కావాలన్నా ఏమి వాలన్నా ఆన్లైన్ ..అలాగే జాతీయ, అంతర్జాతీయ సభలు, సమావేశాలు అన్నీ వర్చ్యువల్ పద్దతిలో జరుగుతున్నాయి. చివరకు ఎన్నికల ప్రచారం, మంత్రి వర్గ సమావేశాలు అదే పద్దతిలో సాగుతున్నాయి. కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచాన్ని ప్రమాదం అంచులలో నిలిపిన కరోనా మహామ్మారి భౌతిక బంధాలను దూరం చేసింది.
కరోనా మహామ్మారి కారణంగా, పార్లమెంట్, శాసన సభ సమావేశాలు, మొక్కుబడి తంతుగా మారి పోయాయి. పార్లమెంట్’ బడ్జెట్ సమావేశాలు కరోనా కారణంగానే అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం అయితే, అసలు సమావేశాలకే పంగనామాలు పెట్టింది. ఆర్డినెన్సు ద్వారా ఆమోదించిన ఓటాన్ బడ్జెట్’తో కాలక్షేపం చేస్తోంది. ఈ నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాలు సహితం వర్చ్యువల్ పద్దతిలో జరపాలనే ప్రతిపాదనపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. నిజానికి, గత సమావేశాల సందర్భంలోనే అందుకు గల సాద్యావకాశాల గురించి రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ సమాలోచనలు జరిపారు. యూకే నుంచి పాకిస్తాన్ వరకు అనేక దేశాల్లో వర్చ్యువల్ పార్లమెంట్ సమావేశాలను ఇప్పటికే నిర్వహిస్తునారు.
అయితే మన దేశంలో మాత్రం ఇంతవరాకు వర్చ్యువల్ పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం జరగలేదు. అయితే, ప్రయోగాత్మకంగా ముందు స్థాయి సంఘం సమావేశాలను వర్చువల్ పద్దతిలో నిర్వహించాలానే విషయంలో మాత్రం పార్లమెంట్ ఉభయ సభల అధ్యక్షులు ఒకని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందు స్థాయి సంఘం సమావేశాలను వర్చ్యువల్ పద్దతిలో నిర్వహించి, ఆ అనుభవాల ఆధారంగా పార్లమెంట్ సమావేశాల విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నారు. కాగా వర్చ్యువల్ పద్ధతిలో పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలను చర్చించడానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గురువారం సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.
కరోనా నేపథ్యంలో భౌతికంగా సమావేశాలు నిర్వహించడం వీలుకానందున, వర్చ్యువల్ విధానంలో పార్లమెంటరీ కమిటీలను సమావేశపరచాలని అనేకమంది ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ విషయం పై వెంకయ్య లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర సీనియర్ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.నిజానికి, పార్లమెంట్ సమావేశాలు వర్చువల్ పద్దతిలో నిర్వహించాలనే విషయంలో రాజకీయ పార్టీలు,పార్లమెంట్ సభ్యులు కూడా సుముఖంగా ఉన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్, మరికొందరు సభ్యులు ఇటీవల రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు.
అయితే పార్లమెంట్ వర్చ్యువల్ పార్లమెంటు సమావేశాలు నిర్వహించడానికి నిబంధనలను సడలించవలసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు చర్చల గోప్యతకు సంబంధించిన నిబంధనలను,అదే విధంగా వ్యక్తిగత హాజరుకు సంబందించిన నిబంధనలను సవరించవలసి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి నిబంధనలు సవరిస్తే అవి లోక్‌సభకు కూడా వర్తిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు భౌతికంగా సమావేశమయ్యే అవకాశం లేనందున రాజ్యాగ నిపుణులను సంప్రదించి ప్రత్యామ్నాయాలను ఆలోచించవచ్చు. ప్రతిపక్ష పార్టీలు కూడా వర్చ్యువల్ సమావేశాలకు సానుకూలంగా ఉన్నాయి. అంతే కాదు ఒక విధంగా, సమావేశాలను వర్చ్యువల్ విధానంలో నిర్వహించాలని గట్టిగ కోరుతున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం కరోనా విషయంలో రిస్క్ తీసుకోలేమని స్పష్టం చే శారు. ఢిల్లీలో కరోనా ఉదృతి తో పాటుగా, సమావేశాల నుంచి స్వరాష్ట్రానికి వెళ్లి అక్కడ క్వారంటైన్ నిబంధనలు పాటించడం తమతో అయ్యేపని కాదని, అందుకు ప్రత్యామ్నాయంగా వర్చ్యువల్ సమావేశాలను ఏర్పాటుచేయాలని ఉభయసభల సభ్యులు రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్‌లను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సభాధిపతులు వర్చ్యువల్ సమావేశాల వైపు మొగ్గుచూపితే, అదే బాటలో రాష్ట్రాల అసెంబ్లీలు, విధానమండళ్లు కూడా వర్చ్యువల్ సమావేశాలను జరుపుకొనే వీలు ఏర్పడుతుంది. అంతా ఆన్లైన్,, జగమంతా వర్చ్యువల్..