కేసీఆర్ బాటలో యోగీ.. యూపీలో దళిత బంధుకు ప్లాన్
posted on Aug 22, 2021 @ 10:45AM
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం, దేశానికే ఆదర్శం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్,పలు సందర్భాలలో ప్రకటించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి అమలుచేస్తున్న రైతు బంధు, తదితర పథకాలు ఏ విధంగా అయితే, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శమయ్యాయో, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి ఆదర్శం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి అన్నట్లుగానే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం చర్చకు వచ్చింది.
ఇందుకు సంబంధించి అధికార బీజేపీ సభ్యుడు సురేష్ కుమార్ త్రిపాఠి లేవనెత్తిన ప్రశ్నకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనూ దళిత బంధు తరహ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి దళిత ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు ఇచ్చే ప్రస్తావన యోగీ చేయలేదు. ఆయన స్టైల్లో ఆయన, యూపీ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల విలువైన దళితుల భూములను అమ్మి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయిస్తే, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, రాష్ట్ర వ్యాప్తంగా భూ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో దళితులు, పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ లో 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం భూకబ్జాలపై ప్రత్యేక దృష్టిని కేరీకరించింది. ముఖ్యంగా, గత ప్రభుత్వాల హయాంలో రాజకీయ మాఫియా ముఠాలు కబ్జా చేసిన వేల ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ఇప్పటి వరకు 67,000 ఎకరాల రెవెన్యూ శాఖ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించిందని ముఖ్యమంత్రి యోగీ తెలిపారు. రాజకీయ, భూమాఫియా నుంచి, స్వాధీనం చేసుకున్న ఈ భూముల్లో దళితులు, పేదలకు ఇళ్లు నిర్మించడంతో పాటుగా, క్రీడా మైదానాలకూ ప్రాధాన్యత ఇస్తామని, యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
అదలా ఉంటే కేవలుం ఒకే ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రకటించిన ఒక లక్షా 70 వేల కోట్ల రూపాయల దళిత బందుకు, మరో ఆరేడు నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్ లో దళితులకు కేవలం ఇళ్లు మాత్రమే కట్టించే ఆ రాష్ట్ర దళిత బంధు పథకానికి పోలిక లేదని తెరాస నాయకులు అంటున్నారు. అయితే, భూములు అమ్మి పదిలక్షలు పంచడం, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఇళ్ళ నిర్మాణం చేపట్టడం ఒకటి కాదని బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. అంతే కాదు, కబ్జాలకు గురైన భూములను రక్షించలేక అమ్మేస్తున్నామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి , వేల ఎకరాల కబ్జా భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న యూపీ సర్కార్’కి పోలిక పొంతన లేదని బీజేపీ నాయకులు వ్యగ్య అస్త్రాలు సంధిస్తున్నారు. మరి, ప్రజలేమంటారో..