అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్.. ఎలా వచ్చిందో తెలుసా?
posted on Aug 22, 2021 @ 10:45AM
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు.
రాఖీ వెనక బలమైన చరిత్ర ఉండేది. పూర్వం యుద్ధాలకు వెళ్లినప్పుడు... ఆ యుద్ధంలో గెలవాలని అన్నలకు సోదరీమణులు... రాఖీలు కట్టేవాళ్లు. ఆ రాఖీలతో వెళ్లే సైనికులు... తమకు తమ సోదరి అండగా ఉన్నట్లు భావించేవారు. అదే ధైర్యంతో యుద్ధంలో పోరాడి గెలిచేవారు. యుద్ధం మధ్యలో రాఖీకి ఏదైనా అయితే... రెచ్చిపోయి... శత్రువుల్ని చీల్చి చెండాడేవాళ్లు. అలా రాఖీ వారిలో ఎక్కడ లేని ఉత్సాహాన్నీ, ధైర్యాన్నీ, తెగువనూ తెచ్చేది.
పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.
యముడు సోదరి అయిన యుమన ప్రతి శ్రావణ పౌర్ణిమ రోజున ఆయనకు రాఖీ కట్టేది. దీనికి బదులుగా యమధర్మరాజు తన సోదరితో ఎవరైతో రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం కలుగుతుందని వరం ఇచ్చాడు.రాజపుత్ర వనిత, చిత్తోర్‌గఢ్ రాణి కర్ణావతి అప్పటి ఢిల్లీ చక్రవర్తి హుమయూన్‌కు రాఖీని పంపి గుజరాత్ పాలకుడు బహదూర్ షా దండయాత్రలను నుంచి తమ రాజ్యాన్ని రక్షించాల్సిందిగా కోరారని, అప్పటి నుంచే రక్షా బంధన్ లేదా రాఖీ ప్రారంభమైందని అంటారు. అయితే ఈ సంప్రదాయం కొన్న వేల ఏళ్ల కిందటే ఉన్నట్లు హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా వేదకాలంలో దీనికి విశేష ప్రాచుర్యం లభించింది. వేదకాలంలో ఈ పండుగను కేవలం సోదరి, సోదరుల బంధంగానే కాదు, భార్యాభర్తలకు సంబంధించింది కూడా అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పురాణంలో ఓ కథ ఉంది.
రాక్షసులతో యుద్ధానికి బయలుదేరిన దేవలోకాధిపతి ఇంద్రుడికి భార్య సచీదేవి రక్షణగా రాఖీ కట్టింది. అయితే ప్రస్తుతం ఇది భార్యభర్తల నుంచి వైదొలగి కేవలం సోదరి-సోదరుల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఉత్సవంగా మారిపోయింది. అలాగే యమధర్మరాజు సోదరి యుమన ప్రతి శ్రావణ పౌర్ణిమకు యుముడికి రాఖీ కట్టేది. తన సోదరితో ఎవరైతో రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం సిద్ధిస్తుందని యుముడు ప్రకటించాడు. అప్పటి నుంచి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి చిరాయువుగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సోదరులు కూడా తమ సోదరికి అశీసులు అందించి ప్రేమను చాటుకుంటారు. వాస్తవానికి పసుపులో దారాన్ని ముంచి, దాన్ని మూడు పొరలుగా చేతికి కట్టిన రాఖీ రక్షణగా ఉంటుంది.
రాణి కర్ణావతి హుమయూన్‌కు రాఖీ పంపిన రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో మేవార్‌లో రక్షా బంధన్ తొలిసారిగా ప్రారంభమై, తర్వాత రాజస్థాన్ అంతటా వ్యాపించింది. అక్కడ నుంచి దేశమంతటా జరుపుకుంటున్నారు. వేడుకల పరంగా రక్షాబంధన్ కాలంతోపాటు మారుతూ వస్తుంది. రాఖీని సోదరి తన సోదరుడు కుడిచేతికి కట్టాలి. రాఖీలో దారం బంధానికి చిహ్నం. అలాగే మంచి చెడులు, వైఫల్యాల నుంచి సోదరుని ఇది కాపాడుతుంది. ఎరుపు రంగు దారం అగ్నికి ప్రతీక... అంటే ఇది శక్తికి, రక్షణకు, భద్రతకు బలం.
ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.
చరిత్రపుటల్లో అలెగ్జాండర్ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చఁపవద్దని రోకా్సనా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చఁపకుఁడా విడిచిపెడతాడు.
మనదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో రాఖి జరుపుకుంటారు. ఒడిశాలో రాఖీ పండుగను 'గ్రహ్మ పూర్ణిమ' అని పిలుస్తారు. ఆ రోజున వారు దైవాల్లా భావించే ఆవులు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, అలంకరిస్తారు. 'పితా' అని పిలిచే మిఠాయిలు చేసి ఇరుగుపొరుగుకి పంచుతారు.మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో ఈ రోజును 'నారియల్ పూర్ణిమ' అంటారు. బాగా వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణుడు, సముద్రుణ్ని పూజిస్తారు. జాలరులు ఈ రోజు నుంచే చేపలు పట్టే కాలం ప్రారంభమైనట్టు భావిస్తారు.ఉత్తరాఖండ్‌లోని ప్రజలు 'జనోపున్యు' పేరుతో రాఖీ పండుగను చేసుకుంటారు. తమ పవిత్రమైన జంధ్యాన్ని మారుస్తారు. చంపావత్ అనే జిల్లాలో బగ్వాల్ పేరుతో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, బీహార్‌లలో 'కజరి పూర్ణిమ' అని పిలుస్తారు. ఇది రైతులకి, కొడుకులున్న తల్లులకి చాలా ముఖ్యమైన పండగ. గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో 'పవిత్రోపన' పేరుతో పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున శివుని గురించి ప్రజలందరూ పూజ చేస్తారు.