కేటీఆర్ కు కవిత రాఖీ కట్టలేదా? ఇద్దరి మధ్య మాటల్లేవా? ప్రగతి భవన్ లో ఏంటీ పరేషాన్?
posted on Aug 22, 2021 @ 5:39PM
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. దేశ వ్యాప్తంగా రాఖి పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కాచెల్లెళ్లు తమ అన్నా దమ్ముళ్లకు రాఖీలు కట్టి ప్రేమను చాటుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం, తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ సీఎం జగన్ కు మంత్రులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీడీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
తెలంగాణ సీఎం నివాసం ప్రగతి భవన్ లోని రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. అక్కాచెల్లెళ్లు లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ ముగ్గురు కలిసి కేసీఆర్‌కు నివాళి హారతి పట్టి, రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగినా.. ఒక వెలికి మాత్రం కనిపించింది. రాఖీ వేడుకల్లో ఎప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే సీఎం కేసీఆర్ కూతురు, మంత్రి కేటీఆర్ సోదరి.. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఈసారి ఎక్కడా కనిపించడకపోవడం అందరిని షాకింగ్ కు గురి చేసింది. ఎమ్మెల్సీ కవిత .. ఆయన సోదరుడు కేటీఆర్ కు ప్రతి ఏటా రాఖీ కడుతుంది. గత కొన్నేండ్లుగా ఎప్పుడు ఆమె ఈ ఈవెంట్ ను మిస్ చేయలేదు. గత ఏడేండ్లుగా ప్రగతి భవన్ లో రాఖీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కాని ఈసారి మాత్రం ప్రగతి భవన్ లో కవిత కనిపించకపోవడం చర్చగా మారింది.
సంతోష్ సోదరి, మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా చాలా మంది నేతలు కేటీఆర్ కు రాఖీ కట్టారు. ఆ ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అందులో ఎంపీ సంతోష్ సోదరి కేటీఆర్ రాఖీ కట్టిన ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూడగానే అందరికి ఎమ్మెల్సీ కవిత గుర్తుకు వస్తోంది. ఎందుకంటే గత కొన్నేండ్లుగా ఎంపీ సంతోష్ సోదరితో కలిసి కేటీఆర్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టేది కవిత. వాళ్లందరు కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. కాని ఈసారి ప్రగతి భవన్ లో ఆ సీన్ కనిపించలేదు. ఎంపీ సంతోష్ సోదరి ఒక్కతే కేటీఆర్ కు రాఖీ కట్టారు. ఆ ఫోటోనే కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ఫోటోను చూసిన వారంతా ఎమ్మెల్సీ కవిత ఎక్కడ? ,అన్న కేటీఆర్ కు సొదరి కవిత రాఖీ కట్టలేదా? కట్టకపోతే ఎందుకు కట్టలేదు? అని చర్చించుకుంటున్నారు.
ప్రతి ఏటా రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనే ఎమ్మెల్సీ కవిత.. ఈసారి ఎక్కడికి వెళ్లారన్నది ఎవరికి తెలియడం లేదు. ఆమె అసలు హైదరాబాద్ లో ఉన్నారా లేక బయటికి వెళ్లారా అన్న చర్చలు కూడా సాగుతున్నాయి. రాఖీ పౌర్ణమి రోజున తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అలాంటిది కవిత ఎందుకు లేదన్నది ప్రశ్నగా మారింది. అందులోనూ రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనే కవిత.. ఈసారి ఫెస్టివల్ ను ఎందుకు మిస్ చేశారన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్ కు కవిత రాఖీ కట్టకపోవడం తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లోనూ తీవ్ర చర్చగా మారింది.
కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలున్నాయని గతంలో ప్రచారం జరిగింది. అన్న కేటీఆర్ తో కవితకు పడటం లేదనే చర్చ కూడా ఉంది. ముఖ్యమంత్రి మార్పు విషయంలో వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. తాజాగా రాఖీ వేడుకల్లో కవిత కనిపించకపోవడంతో వాళ్లిద్దరి మధ్య విభేదాలు నిజమేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాఖీ కట్టలేనంత గ్యాప్ ఇద్దరి మధ్య వచ్చిందా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. మొత్తంగా ప్రగతి భవన్ లో జరిగిన రాఖీ వేడుకల్లో కవిత కనిపించకపోవడం, అన్న కేటీఆర్ కు ఆమె రాఖీ కట్టకపోవడం తెలంగాణలో పెద్ద చర్చగానే మారిపోయింది..