యూపీ సీఎంపై వేటు? కొవిడ్ కట్టడిలో విఫలమే కారణం?
posted on Jun 3, 2021 @ 3:51PM
దేశంలో కొవిడ్ 19 ఉదృతి కొంత తగ్గుముఖం పట్టినా ... కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి అలాగే కొనసాగుతోంది. కొవిడ్ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాల లోనూ ఎక్కడికక్కడ,అధికార, ప్రతిపక్ష పార్టీలు, పరస్పర ఆరోపణలతో కొవిడ్ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి.
ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కొవిడ్ రాజకీయం అధికార పార్టీలో అలజడి సృష్టిస్తోంది. కొవిడ్ నియంత్రణలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విఫలమయ్యారని విపక్షాలు కాదు స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ కట్టడిలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినాయకత్వం కూడా ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాయి. ముఖ్యంగా మరో ఆరేడు నెలల్లో రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కొవిడ్ కొంప మున్చుతుందన్న భయం కమలనాదులను వెంటాడుతోంది. ఈ నేపధ్యంలోనే ఇటీవల బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు సమావేశమై, యూపీలో కొవిడ్ పరిస్టితి, రాజకీయపరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో తిరిగి అధికారం అందుకునేందుకు, రోడ్ మ్యాప్ ను సిద్దం చేశారు. ఇందులో భాగంగా సంస్థాగత మార్పులతో పాటుగా, ముఖ్యమంత్రి నాయకత్వ మార్పు విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్రంలో కొవిడ్ పరిస్థితితో పాటుగా, రాజకీయ పరిస్థితిని అంచనా వేసేందుకు బీజేపీ, జాతీయ నాయకత్వం,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్రానికి పంపింది.ఈ ఇద్దరు నాయకులు సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులతో పాటుగా, వివిద స్థాయిల నాయకులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ పట్ల ప్రజలు స్పందన ఎలా వుంది? ఏమనుకుంటున్నారు? ఇలా వివిధ కోణాల్లో, వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, కేంద్ర నాయకులు ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్, ఉప ముఖ్యమంతరులు కేశవ్‌ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలతోనూ భేటీ అయ్యారు. దీంతో ఎన్నికల ముంగిట సీఎంను మార్చనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
గడచిన వారం పది రోజుల్లో రాష్ట్రంలో కొవిడ్ కేసులు సంఖ్య తగ్గిందని , రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ రాధా మోహన్ సింగ్, కొవిడ్ కంట్రోల్ విషయంలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్,పని తీరును కితాబు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, మీడియాతో మాట్లాడిన రాధా మోహన్ సింగ్ తమ పర్యటన ఉద్దేశం ముఖ్యమంత్రి మార్చడం కాదని, పార్టీ చేసిన సామాజిక కార్యక్రమాలను సమీక్షించడం, కరోనా మూడవ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున తగు ప్రణాళిక రూపొందించడం కోసమే అని స్పష్టం చేశారు.అలాగే, “ఐదు వారాల్లో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రోజువారీ కరోనా కేసుల సంఖ్యను 93% తగ్గించింది… ఇది 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మున్సిపాలిటీ వంటి 1.5 కోట్ల జనాభాలు గల రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిస్థితులను సరిగా నిర్వహించలేని సమయంలో యోగీజీ చాలా సమర్థవంతంగా నిర్వహించగలిగారు” అని బి ఎల్ సంతోష్ తన పర్యటన ముగింపు సందర్భంగా ఒక ట్వీట్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
నాయకత్వ మార్పు వార్తలను బీజేపీ ఖండించినా.. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని బీజేపీ నాయకులే అంగీకరిస్తున్నారు. కొత్తగా నమోదవ్తున్న కేసుల సంఖ్య తగ్గుతున్నా, పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయని,అదే విధంగా కొవిడ్’తో చనిపోయిన వారి మృత దేహాలను గంగానదిలో పారవేయడం, భౌతిక కాయాలను లోతులేని గోతుల్లో ఖననం చేయడంపై పెద్దఎత్తున వార్తలు వచ్చాయు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ బీజేపీ, తీవ్ర విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ పరిస్థితిలో ఆదిత్య నాథ్ పై వేటు తప్పక పోవచ్చని కొదంరు పార్టీ నేతలు పేర్కొంటున్నారు? అయితే ..ఎన్నికల ముంగట ముఖ్యమంత్రిని మారుస్తారా? అనేది, ఆలోచించవలసిన విషయమే అంటున్నారు.