టెట్ సర్టిఫికెట్ ఇక లైఫ్ టైమ్.. టీచర్ అభ్యర్థులకు కేంద్రం వరం
posted on Jun 3, 2021 @ 5:05PM
విద్యాశాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేసిన మోడీ సర్కార్ .. తాజాగా టెట్ ( Teacher Eligibility Test) సర్టిఫికెట్ గడువును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేవారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు.ఏడేళ్ల కాలపరిమితి ముగిసిన వారికి మళ్లీ సర్టిఫికెటు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ పలు సూచనలు జారీ చేసింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో 2011 నుంచి టెట్ సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు జీవితకాలం అర్హత వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) క్వాలిఫై కావడం తప్పనిసరి. దీంతోపాటు వ్యాలిడిటీని కూడా చూస్తారు. టెట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, కేంద్రం (CTET) కూడా వేర్వేరుగా నిర్వహిస్తాయి. ఈ టెట్ సర్టిఫికెట్ వేలిడిటీ ఏడేళ్లు అని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE 2011లో మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రస్తుతం దాని మార్కుల విలువ ఏడేళ్ల వరకు ఉంది. ఆలోపు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుకు ఎంపిక కాకుంటే ఆ పరీక్షను మళ్లీ రాయాల్సిందే. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) తాజాగా టెట్ స్కోర్ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా నిర్ణయించింది. ఇక నుంచి టెట్ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షల మందికి ఊరట కలగనుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీఈ 50వ సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్ణయించారు.
కేంద్ర సర్కార్ తాజా నిర్ణయం తెలంగాణ ఉపాధ్యాయ అభ్యర్థులకు వరంగా మారనుంది. రాష్ట్రంలో చాలా కాలంగా టెట్ నిర్వహించడం లేదు. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల టెట్ కాల పరిమితి ముగిసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావించింది. అయితే టెట్ నిర్వహించకపోవడం అడ్డంకిగా మారింది. కోవిడ్ పరిస్థితుల్లో ఇప్పట్లో టెట్ నిర్వహించడం కూడా అసాధ్యమే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయాలన్నది గందరగోళంగా మారింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో ఇప్పుడా సమస్య తీరినట్లే.