జగన్ పాలనలో ఏపీ ఆగమాగం.. ఉండవల్లి సంచలనం
posted on Oct 9, 2021 @ 2:22PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ, వైఎస్సార్ ప్రధాన అనుచరుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని మండిపడ్డారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని అన్నారు.
వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుకు దేశంలోని ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా ఏపీ మాత్రం ఒప్పుకుందని ఉండవల్లి విమర్శించారు. పోలవరంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రాజెక్ట్ పనులు పూర్తికాకపోయినా హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
పోలవరం పనుల్లో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.4,068 కోట్లు కొర్రీలు వేశారని ఉండవల్లి ఆరోపించారు. పనులు పూర్తి కాకపోయినా మంత్రులు హడావుడి చేస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడం లేదన్నారు. తాగునీటి విషయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు ఉండవల్లి. పోలవరం నిధులపై రాష్ట్రం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతోందని.. అయినా పోలవరం నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదని ఉండవల్లి కామెంట్ చేశారు.