ఆ 5 రోజులు ఏం జరిగింది?.. ఢిల్లీలో మిస్సైన తెలుగు డాక్టర్లు సిక్కింలో చిక్కారు
posted on Jan 2, 2020 @ 1:56PM
ఎట్టకేలకు ఢిల్లీ డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఢిల్లీల్లో అదృశ్యమైన తెలుగు వైద్యులు సిక్కింలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాళ్లిద్దరిని ఇవాళ ఢిల్లీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అదృశ్యమైన ఈ 5 రోజులు ఏమైంది తెలుసుకునే క్రమంలో ఇవాళ విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిలీప్, హిమబిందు, ఆమె భర్త శ్రీధర్ ముగ్గురు కర్నూలు మెడికల్ కాలేజీ లోనే చదువుకున్నారు. హిమబిందు, శ్రీధర్ డిల్లీలో డాక్టర్లుగా ఉంటే దిలీప్ చండీగఢ్ లో పనిచేసేవాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన దిలీప్ ను డిసెంబర్ 25 న ట్రైన్ ఎక్కించేందుకు హిమబిందు వెళ్లింది. ఆ రోజు నుంచి నిన్నటి వరకు వాళ్లిద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. దీంతో హిమబిందు భర్త శ్రీధర్ కేసు పెట్టారు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న ఒక సీసీ ఫుటేజ్ తప్ప కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారం లేదు.
మరోవైపు సంచలనం రేపిన మిస్సింగ్ మిస్టరీని చేధించాలని ఢిల్లీ ఎయిమ్స్ కూడా కేంద్ర హోంశాఖను కోరింది. ఇద్దరిలో ఒకరి ఫోన్ కూడా పనిచేయటం లేదు.. రెండు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు కేసు ఒక సవాల్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఎటైన వెళ్లారా అనే కోణంలో మొదటి దర్యాప్తు మొదలైంది. కానీ వాళ్ళ ఎకౌంట్స్ నుంచి రూపాయి కూడా ట్రాన్జాక్షన్ జరగలేదు. ఎక్కడా కార్డ్ స్వైప్ కాలేదు, టికెట్లు కొన్నట్టు ఆధారాలు లభించలేదు. ఒకవేళ క్యాష్ ట్రాన్జక్షన్ చేశారని భావించిన వారి వద్ద అంత నగదు లేదని భర్తనే చెప్పాడు. ప్రేమ వ్యవహారం కారణం కావచ్చని పోలీసులు భావించారు.. కానీ ఆధారాలే లేవు. ఒకవేళ ప్రేమ వ్యవహారం కాకుంటే ట్రాఫికింగ్ ముఠాల పని ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానించారు. కానీ ఇప్పుడు దిలీప్ ఏమై ఉంటాడో అనే ప్రశ్న వెంటాడింది. ఎవరైనా దిలీప్ కు హాని చేసి హిమబిందును తీసుకు వెళ్ళారా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచించారు. ఇలా ఎన్నో అనుమానాల మధ్య ఢిల్లీ పోలీసులు మిస్సింగ్ కేసును దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ లో ఇద్దరి చేతుల్లో బ్యాగేజ్ ఉంది. అది ఒకరిదా ఇద్దరూ సర్దుకొని వెళ్లారా అనే కోణంలో గాలించారు. అంతిమంగా వాళ్లు వాడిన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎట్టకేలకు గుర్తించారు. హిమబిందు, దిలీప్ లో సిక్కింలో ఉన్నట్టు పసిగట్టారు. ఇవాళ వాళ్ళను ఢిల్లీ తీసుకొచ్చి ఇన్నాళ్లు ఏమైపోయారో తేల్చేయబోతున్నారు.