అమరావతిలో వ్యవసాయ జోన్.. రైతులకిచ్చే భూములను ఇలా మార్చనున్న ప్రభుత్వం!
posted on Jan 2, 2020 @ 1:41PM
మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పటినుండి రాజధాని ప్రాంత రైతులు వారి వారి ఇళ్లల్లో కంటే రోడ్ల మీదే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి నిత్యం ఆందోళనలు.. ధర్నాలతో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను అమల్లో పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. మూడు రాజధానుల విషయంలో న్యాయపరమైన అడ్డంకులను తొలగించుకునేందుకు ఓ వైపు ప్రయత్నం చేస్తూనే అమరావతి భవిష్యత్తుపైన ఆలోచన చేస్తోంది జగన్ ప్రభుత్వం. రైతులకు భూమిని తిరిగి ఇచ్చేస్తామంటూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నిజంగానే ఆ భూములను తిరిగి ఇచ్చేస్తారా లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందా అనేది చర్చనీయాంశమైంది. ఈ మేరకు రాజధాని అమరావతి నగర నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన భూములతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని స్పెషల్ అగ్రికల్చర్ జోన్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం నిపుణుల నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రత్యేక ఆర్ధిక మండళ్ల పురోగతిని పరిశీలించిన అనంతరం ఈ నివేదిక రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
వాణిజ్య పరంగా అత్యంత విలువైన పంటలకు హబ్ గా అమరావతిని మార్చాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రైతుల నుంచి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను సేకరిస్తే వాటిలో రోడ్లు, వివిధ నిర్మాణాలుమ, వివిధ సంస్థలకు కేటాయింపులు పోను ప్రస్తుతం 8274 ఎకరాలు అందుబాటులో ఉంది. ఇంకా పనులు మొదలు పెట్టని సంస్ధల నుంచి భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్న దాదాపు 10 వేల ఎకరాలను కూడా జతచేసి వ్యవసాయ జోన్ గా మార్చే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రోడ్లు భవనాలను యథాతథంగా ఉంచి రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు మిగిలిన భూములని ఎస్ఎజెడ్ పరిధి లోకి తెచ్చేలా ఆలోచన చేస్తున్నారు. సమీకృత వ్యవసాయ అభివృద్ధికి ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి అనే విషయాన్ని నిపుణుల నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. స్పెషల్ అగ్రికల్చర్ జోన్ కు రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్ని అందించే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అధునాతన వ్యవసాయ విధానాలైన వర్టికల్ ఫామింగ్, హైడ్రోఫోనిక్స్, ఆర్గానిక్ వ్యవసాయం, వాణిజ్య, ఉద్యాన పంటలు, ఔషధాలు, సుగంధ, లేపనాలు సాగు, పశుగణాభివృద్ధి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యవసాయ క్షేత్రాల నుంచి నేరుగా వినియోగదారునికి సరఫరా చేసేలా ఈ మార్కెట్ కు అనుసంధానించే అవకాశముందని నివేదికల్లో ప్రస్తావించారు. ఉత్పత్తుల వారీగా సామూహిక వ్యవసాయ విధానాలతో పాటు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సహకార వ్యవస్థ ద్వారా విక్రయాలను చేపట్టే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు నిపుణులు.
విశాలమైన వ్యవసాయ క్షేత్రంగా అమరావతిని అభివృద్ధి చేసే అవకాశం ఉండటంతో ఎక్స్ పోర్టు జోన్ గా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో స్పెషల్ అగ్రికల్చర్ జోన్ ఓ ఆదర్శ విధానంగా బెంచ్ మార్క్ గా ఉంటుందనే భావన కూడా సదరు నివేదికను రూపొందించిన నిపుణులు అభిప్రాయపడ్డట్లుగా సమాచారం. స్పెషల్ అగ్రికల్చర్ జోన్ లో రైతులను భాగస్వాములుగా చేసి ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. స్పెషల్ అగ్రికల్చర్ జోన్ కు అనుబంధంగా ఇతర ఆహార శుద్ధి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని నివేదికలో స్పష్టం చేసినట్టు అధికారిక వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఆహార భద్రతా సవాళ్లకు విరుగుడుగా ఈ స్పెషల్ అగ్రికల్చర్ జోన్ మారుతోందనే అభిప్రాయముంది. అయితే ప్రత్యేక వ్యవసాయ జోన్ ఆలోచననూ రాజధాని ప్రాంత రైతులు ఏ మేరకు అంగీకరిస్తారనేది చూడాలి. ప్రస్తుతం రాజధాని రైతులు తమ పోరాటాన్ని కేవలం తమ భూముల కోసం కాకుండా పూర్తి స్థాయి రాజధానిని అమరావతిలోనే ఉంచాలనే దిశగా ఆందోళనలను ముమ్మరం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ జోన్ దిశగా రైతులను ఒప్పించగలుగుతుందా, ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంచెం సమయం తీసుకొని ఈ ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.