రాజాసింగ్ ఒకటడిగితే.. కేటీఆర్ రెండిచ్చారు.. సుఖీభవ!
posted on Oct 23, 2021 @ 1:11PM
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. రెండు పార్టీల మధ్య హోరాహోరీ. కేసీఆర్ సర్కారును కార్నర్ చేస్తూ కమలం పార్టీ నేతలు దూకుడు మీదున్నారు. గులాబీ పార్టీ సైతం ఎక్కడా తగ్గట్టేదు. బీజేపీ విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికతో బీజేపీ-టీఆర్ఎస్ జగడం పీక్స్‌కు చేరింది. ఇక ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సర్కారును బాగా ఇబ్బంది పెట్టారు. ఇటు రఘునందన్, అటు రాజాసింగ్.. ఇద్దరూ రేసుగుర్రాల్లా బీజేపీ బండిని పరుగులెత్తించారు. కట్ చేస్తే.. అసెంబ్లీ ముగిశాక కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని వదలలేదు. ఇటీవల పాతబస్తీ సమస్యలపై మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో ఖతర్నాక్ సవాల్ విసిరారు.
డుగ్గు డుగ్గు డుగ్గు డగ్గు మంటూ నీ బుల్లెట్టు బండెక్కి వస్తానప్పా.. సాంగ్‌ను వాడుకుంటూ.. మంత్రి కేటీఆర్‌ను తాను ప్రతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గ సమస్యలను స్వయంగా చూసేందుకు ఆహ్వానించారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారని.. ఆయన వస్తే తన బైక్‌పై తిప్పుతూ ఇక్కడి అభివృద్ధి కళ్లకు కట్టినట్టూ చూపిస్తానంటూ ట్విటర్‌లో ఆహ్వానించారు. రాజాసింగ్ ఆ ట్వీట్‌ను అక్టోబర్ 16న చేస్తే.. తీరిగ్గా వారం తర్వాత తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు.
పెట్రోల్ ధరల పెంపుపై ప్రజలు ఏమంటున్నారో ఎందుకు తెలుసుకోవట్లేదు అని రాజాసింగ్‌కు కౌంటర్ ఇచ్చారు. గ్యాస్ ధర పెంపుపై ఇళ్ల వద్ద ఆగి తెలుసుకోవాలన్నారు. జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెరుగుదల అంటున్నారన్నారు. మాటల గారడి ఆపి ప్రజల హృదయాలను గెలుచుకోవాలి కేటీఆర్.. రాజాసింగ్‌కు ట్విటర్‌లో కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య ట్వీట్ ఫైల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.