ఈటల, రేవంత్ సీక్రెట్ మీటింగ్.. హుజురాబాద్‌లో మారుతున్న ఈక్వేషన్..
posted on Oct 23, 2021 @ 1:08PM
టీఆర్ఎస్-బీజేపీ దొందూ దొందే..అనేది కాంగ్రెస్ ఆరోపణ. టీఆర్ఎస్-కాంగ్రెస్ మిలాఖత్ అనేది బీజేపీ విమర్శ. మొదటి నుంచీ ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాం. కానీ, కాంగ్రెస్-బీజేపీలు కుమ్మక్కయ్యాయనే ప్రచారం హుజురాబాద్ ఎన్నికల నాటి నుంచి జరుగుతోంది. అధికార పార్టీ పదే పదే ఈ ఆరోపణ చేస్తోంది. ఉప ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని.. ఈటలను గెలిపించేందుకే హస్తం పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని టీఆర్ఎస్ సూటిగా విమర్శిస్తోంది. గతంలో కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసి పని చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థులైన వినోద్‌కుమార్, కవితలను ఓడించాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేస్తున్నారు.
తాజాగా.. కేటీఆర్ మరింత సంచలన ఆరోపణలు చేశారు. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలు.. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించి కలకలం రేపారు. ఈటల, రేవంత్ కలిశారో లేదో వాళ్లిద్దరే స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే, వారిరువురూ కలిసినట్లు ఉన్న ఆధారాలను తామే బయటపెడతామని అన్నారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్ మరోసారి ఆరోపించారు. కేటీఆర్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగా ప్రకంపణలు రేపుతోంది.
టీపీసీసీ అధ్యక్షులు అయ్యాక రేవంత్‌రెడ్డికి హుజురాబాద్ ఎలక్షన్ తొలి సవాల్. అందుకే కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతారని అనుకున్నారు. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లాంటి బలమైన నేతలను బరిలో దింపుతారని భావించారు. కానీ, అంచనాలకు విరుద్దంగా విద్యార్థి నాయకుడిని పోటీలో నిలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఆ పార్టీ విద్యార్థి నాయకుడే కావడంతో టీఆర్ఎస్‌కు పడే యూత్ ఓట్లు చీల్చేందుకే ఇలా చేశారని అన్నారు. నాన్‌లోకల్ కేండిడేట్‌ను నిలబెట్టి.. పోటీ టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉండేలా బలహీన అభ్యర్థిని పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఇక ఓవైపు పోలింగ్‌కు గడువు దగ్గరపడుతున్నా.. ఇంత వరకూ రేవంత్‌రెడ్డి హుజురాబాద్‌లో అడుగుకూడా పెట్టనే లేదు. ఇలా.. బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ సహకరిస్తోందనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. అయితే, రేవంత్‌రెడ్డి వ్యూహం రేవంత్‌కు ఉందంటున్నారు.తాము ఓడినా.. కేసీఆర్‌ను ఓడించి.. పరోక్షంగా గెలవాలనేది రేవంత్‌రెడ్డి వ్యూహంలా తెలుస్తోంది.
హుజురాబాద్‌లో ఎంతగా ఫైట్ చేసినా కాంగ్రెస్ గెలుపు చాలా కష్టం. అక్కడ పోరు కేసీఆర్ వర్సెస్ ఈటల మధ్యే సాగుతోంది. మధ్యలో దూరి, అనవసరంగా హడావుడి చేసినా.. కాంగ్రెస్ సాధించేదేమీ ఉండదు. అలా చేస్తే టీఆర్ఎస్‌కే అనుకూలంగా మారుతుంది. అందుకే, హుజురాబాద్‌కు పెద్దగా ప్రధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ కాస్త స్తబ్దుగా ఉంటోంది. ఇంత వరకూ ఓకే. కానీ, ఈటల-రేవంత్‌లు రహస్యంగా భేటీ అయ్యారనే విషయం మాత్రం బ్రేకింగ్ న్యూసే.
మంత్రి కేటీఆర్ నేరుగా ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో ఈటల-రేవంత్‌లు సమావేశమయ్యారని సూటిగా చెబుతున్నారు. ఆ విషయం మీరు చెబుతారా? లేక, ఆధారాలు మేమే బయటపెట్టాలా? అంటూ సవాల్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ అంత ధీమాగా చెబుతున్నారంటే.. వారిద్దరి భేటీ నిజమే అయింటుందని అంటున్నారు. అదే జరిగితే.. బీజేపీ-కాంగ్రెస్‌లు కుమ్మక్కు అయ్యాయనే టాక్ పోలింగ్ ముందు పొలిటికల్ ఈక్వేషన్‌ను మార్చేయనుంది. ఇందులో లాభమూ నష్టమూ రెండూ ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ కన్ఫూజన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కేసీఆర్ యాంటీ ఓటింగ్‌లో కొన్ని వర్గాలు బీజేపీకి ఓటు వేయకపోవచ్చు. వారంతా కాంగ్రెస్‌కు ఓటేద్దాం అనుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్-బీజేపీ ఒకటేనని తేలితే.. మళ్లీ అధికార పార్టీకే షిఫ్ట్ అవ్వొచ్చు. ఇక.. ఈటలకే కాంగ్రెస్ సపోర్ట్ అని నేరుగా మెసేజ్ వెళితే.. ఓటింగ్ అంతా డైరెక్ట్‌గా రాజేందర్‌కే పడొచ్చు. ఇలా, కేటీఆర్ తానేదో గొప్ప విషయం బయటపెట్టానని ఫీల్ అయితే.. ఆ ఫలితం ఈటల రాజేందర్‌కే అనుకూలంగా మారనుందని అంటున్నారు. ఎలా చూసినా.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు కష్టకాలమే అని చెబుతున్నారు.