టీఆర్ఎస్ కు నో రూల్స్.. రేవంత్ రెడ్డికి మంచి ఛాన్స్..
posted on Oct 23, 2021 @ 12:45PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని రూల్స్ అమల్లోకి తెచ్చింది. సిటీలో బ్యానర్లు, ఫ్లైక్సీలను నిషేదించడం అందులో ఒకటి. కొన్ని నెలలుగా ఈ రూల్ ను అమలు చేస్తోంది. గతంలో చాలా మంది ఈ రూల్ ను ఉల్లఘించారంటూ ఫైన్లు కూడా వేసింది బల్దియా. సీన్ కట్ చేస్తే హైదారాబాద్ లో రెండు రోజులుగా కనిపిస్తున్న సీన్లతో జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ లో ఎక్కడ చూసిన గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. నగరం మొత్తం గులాబీ జెండాలతో నింపేశారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారుతోంది. బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేదం హైదరాబాద్ లో అమల్లో ఉందా లేదా అన్న చర్చ జరుగుతోంది.
మాదాపూర్ హైటెక్స్ లో అక్టోబర్ 25, సోమవారం టీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతోంది. పార్టీ 20వ వార్షికోత్సవం కావడంతో ఈసారి ప్లీనరీని భారీ ఎత్తున నిర్వహిస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ప్లీనరీ కోసం హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరీలింగంపల్లి నియోజకవర్గాల్లో వందలాదిగా వేలాదిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో నిలువెత్తు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల వెంట గులాబీ జెండాలు కట్టారు. మొత్తంగా ప్రస్తుతం హైదారాబాద్ మొత్తం గులాబీ మయమైంది. దీంతో జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ కటౌట్లు ఏర్పాటు చేయడంపై బల్దియాకు ఫిర్యాదులు అందుతున్నాయి. తాత్కాలికంగా ఎన్ఫోర్స్‌మెంట్ ట్విటర్ ఖాతాను అధికారులు నిలిపివేశారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ మూడురోజుల సెలవులో ఉన్నారు. నెటిజన్ల ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించడం లేదు. దీంతో అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే బల్దియా అధికారులు స్పందించడం లేదని, ఎవరికి అందుబాటులో లేకుండా పోయారనే ఆరోపణలు వస్తున్నాయి. గత జూలైలో పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆసమయంలో అతనికి జరిమానా వేసింది జీహెచ్ఎంసీ. ఇప్పుడు మాత్రం స్పందిచండం లేదు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై ప్రతి పక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దీనిపై బల్దియాను ఏకిపారేసేందుకు సిద్ధమవుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇటీవల ఉప్పల్ చౌరస్తాలో హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి అండతో అక్రమ నిర్మాణం వెలుస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ చౌరస్తాను ఆనుకొని కడుతున్న అక్రమ నిర్మాణంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘మీ శాఖలో బాగోతాలు మీద చర్యలు ఉంటాయా..? లేదా మీరూ ఇందులో భాగస్వాములేనా..?’ అంటూ కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిర్మాణానికి సంబంధించిన వీడియోతో సహా కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎంఓ కార్యాలయానికి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కూడా టాగ్ చేశారు.
రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే స్పందించారు. అనుమతులు లేకుండా కడుతున్న బిల్డింగ్ సెంట్రింగ్ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇదేదో ఫిర్యాదు చేయగానే స్పందిస్తే బాగుండేదిగా.. రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగితేనే పనవుతుందా? అంటూ స్థానికులు జీహెచ్ఎమ్‌సీ అధికారులపై మండిపడ్డారు. తాజాగా ఇప్పుడు గ్రేటర్ లో వెలిసిలన గులాబీ జెండాలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే బల్దియా అధికారులకు కష్టాలు తప్పవనే చర్చ సాగుతోంది.