కేంద్రం ఎంట్రీతో తెలంగాణ, ఏపీకి చిక్కులు... కొత్త మలుపు తిరిగిన ఆర్టీసీ కేసు...
posted on Nov 8, 2019 9:11AM
ఆర్టీసీ సమ్మె కేసులోకి కేంద్రం ఎంటరైంది. తెలంగాణ సర్కారుతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో తన వాదనలు వినిపించింది. అసలు ఏపీఎస్-ఆర్టీసీ విభజనే జరగలేదన్న కేంద్రం... టీఎస్-ఆర్టీసీ కొత్తగా ఏర్పాటు చేశారా అంటూ ప్రశ్నించింది. ఏపీఎస్-ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉందన్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్... ఇప్పటికీ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని తెలిపారు. అసలు ఆర్టీసీ విభజనే జరగనప్పుడు... టీఎస్-ఆర్టీసీకి చట్టబద్ధత ఎక్కడుందంటూ వాదించింది. అంతేకాదు, నేరుగా టీఎస్-ఆర్టీసీకి ...ఏపీఎస్-ఆర్టీసీ ఆస్తులు బదిలీ అవుతాయనే వాదనల్లో నిజం లేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ...హైకోర్టుకు విన్నవించారు.
కేంద్రం వాదనలు విన్న హైకోర్టు... ఆర్టీసీ విభజన జరగకుండా అసలు నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, కేంద్రం వాదనలపై సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ అండ్ ఏజీలు హైకోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం... టీఎస్-ఆర్టీసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, ఏపీఎస్-ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలూ... కేంద్రం అనుమతి ఎందుకు కోరలేదని హైకోర్టు ప్రశ్నించింది. అసలు, ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అంటూ హైకోర్టు నిలదీసింది.
కేంద్రం తాజా వాదనతో ఇటు తెలంగాణ... అటు ఏపీ... రెండింటికీ తలనొప్పులు తప్పవనే మాట వినిపిస్తోంది. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వాదనలను విశ్లేషిస్తే... కేంద్రానికి చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు కుదరవని అంటున్నారు. ఏపీఎస్-ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉందని, ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదని చెప్పడం ద్వారా... తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ గానీ, ఏపీలో విలీనం కానీ అంత ఈజీ కాదనే మాట వినిపిస్తోంది. మొత్తానికి, కేంద్రం ఎంట్రీతో ఆర్టీసీ కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.