టిక్ టాక్ వల్ల భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయిన భార్య...
posted on Nov 7, 2019 @ 5:42PM
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాక టిక్ టాక్ అంటే తెలియని వారే ఉండనంత క్రేజ్ సంపాదించుకుంది టిక్ టాక్. అయితే ఇటివల టిక్ టాక్ వల్ల చాలా మంది చిక్కుల్లో పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఘటనే మళ్ళీ చోటు చేసుకుంది. టిక్ టాక్ పచ్చని సంసారంలో చిచ్చు రేపింది, మంటలు పెట్టించింది. భార్యపై భర్తకు అనుమానం పెంచేలా చేసింది. చివరికి ఆ టిక్ టాక్ వీడియోలే ఆమెను భర్త చేతిలో హతం అయ్యేలా చేశాయి. సోషల్ మీడియా మాయలో కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. టిక్ టాక్ వీడియోల మోజులో పడి జీవితాలు నాశనమవుతున్నాయి అనడానికి ఇది మరో ఉదాహరణ.
ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్ లాల్ వీధిలో భార్యాభర్తలు ఫాతిమా, పాచూ కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. కనిగిరి మండలం తాళ్ళూరుకు చెందిన ఫాతిమా కనిగిరి లో టైలర్ పని చేసే పాచూని వివాహం చేసుకుంది. కొంత కాలంగా భర్తతో ఫాతిమాకు విభేదాలు ఏర్పడ్డాయి. భార్య ఫాతిమాకి వివాహేతర సంబంధం ఉందని, నగదు కూడా విపరీతంగా ఖర్చు చేస్తూ ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తోందనే కారణంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇలా ఉండగానే రెండు నెలల క్రితం ఫాతిమాకి ఎంపీడీవో ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం వచ్చింది. అంతేగాకుండా టిక్ టాక్ లో తాను ఆడుతూ పాడుతూ చేసిన వీడియోలు అప్ లోడ్ చేయడం కూడా ఆమెకి ఫ్యాషన్ గా మారిపోయింది. వీటన్నింటిని చూసిన భర్త.. వద్దని వాదించినా అతని మాట వినకుండా టిక్ టాక్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం ఆపలేదు ఆమె. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ వీడియోలు చూసి పాచూలో మరింత పెరిగింది. ఆ అనుమానం పెనుభూతంలా మారి భార్యను దారుణంగా హత్య చేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫాతిమా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించి.. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఫాతిమా హత్యకు కారణం టిక్ టాక్ అని నిందితుడి సోదరులు చెప్తున్నారు. ఫాతిమాకు టిక్ టాక్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం అంటే పిచ్చిగా మారిపోయిందంటున్నారు. మొత్తం మీద టిక్ టాక్ మోజులో పడి భర్త చేతిలో భార్య బలైపోయిన ఈ ఘటన దుమారం రేపుతోంది.