మీరు తేల్చుతారా? మమ్మల్ని తేల్చమంటారా? కేసీఆర్ సర్కారుకు హైకోర్టు వార్నింగ్
posted on Nov 8, 2019 9:19AM
మీరు తేల్చుతారా... మమ్మల్ని తేల్చమంటారా... అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించింది హైకోర్టు. వీలైనంత త్వరగా ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని, లేదంటే తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని... తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు... ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే.... కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయనే సంగతి మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చింది.
ఇక, ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై ఆయా శాఖాధిపతులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే... కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలుసా? లేదా? అంటూ అధికారుల్ని హెచ్చరించింది. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ... ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు.... సమర్పించిన నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టు మండిపడింది. ఐఏఎస్‌లు... ఇలా కోర్టుకు అసంపూర్ణ నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారమే తాము నివేదికలు ఇచ్చినట్లు అధికారులు... హైకోర్టుకు రిప్లై ఇవ్వడంతో... అలాగైతే, మొదటిసారి ఇచ్చిన నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా? అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఇంత దారుణంగా తప్పుడు వివరాలు ఇచ్చిన అధికారులను తన సర్వీసులో చూడలేదంటూ హైకోర్టు సీజే ఆర్ఎస్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆర్ధికశాఖ... ఆర్టీసీ నివేదికల్లోని అంకెలు వేర్వేరుగా ఎందుకున్నాయంటూ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సమస్యను తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు... పదాలు వాడారని అభిప్రాయపడింది. అధికారుల నివేదికలను చూస్తుంటే... కోర్టునే కాకుండా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, రవాణాశాఖ మంత్రిని, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా తప్పుదోవ పట్టించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారుల నివేదికలపై మరోసారి హైకోర్టు ఫైరవడంతో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. పొరపాటుకు మన్నించాలని కోరారు. అయితే, క్షమాపణ కోరడం సమాధానం కాదన్న హైకోర్టు.... వాస్తవాలు చెప్పాలంటూ చురకలు వేసింది.
నీటి పారుదల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తోన్న ప్రభుత్వం.... ఆర్టీసీ కార్మికుల కోసం 49కోట్లు చెల్లించడానికి ఎందుకు ఇబ్బంది పడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోవాలని... మానవతా దృక్పథంతో ఆలోచించాలని సూచించింది. కార్మికుల డిమాండ్లను మరోసారి పరిశీలించి... చర్చలు జరపాలని ఆదేశించింది.