భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు! ప్రజలకు భారమా.. లాభమా?
posted on Nov 10, 2021 @ 4:07PM
భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు తహసీల్దార్లు చూస్తుండగా.. ఇకపై కొత్త వారికి బాధ్యతలు అప్పగించనుంది. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారాల బాధ్యతలు
డిప్యూటీ తహసీల్దార్ లకు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే వీళ్లకు ధరణి పోర్టల్ లో లాగిన్ సౌకర్యాన్ని కల్పించింది. ధరణి పోర్టల్ ను ప్రారంభించి ఏడాది పూర్తికావడంతో వెబ్ సైట్ లో పలు మార్పులు చేర్పులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు చూసిన తహసీల్దార్లకు ఆ భారం నుండి విముక్తి కల్పించనుంది
ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్ లు నిర్వర్తిస్తుండటంతో మిగతా రెవెన్యూ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో తహసీల్దార్ లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు లేనప్పుడు 50కి పైగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను పరిష్కరించేందుకు వీరికి సమయం లేకపోవడంతో చాలా పనులు పెండింగ్ లో ఉంటున్నాయి. దీంతో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ సమస్యను తగ్గించడానికి తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలను తప్పించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.తమకు పనిభారం ఎక్కువైందని రెవెన్యూ సంఘాల నాయకులు తహసీల్దార్ల తరపున సీఎం కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇది కూడా ప్రభుత్వ తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.
ధరణి పోర్టల్ ను ప్రారంభించి గత అక్టోబర్ నెలకు సంవత్సరం పూర్తైంది. 574 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏడాదిలో ధరణి పోర్టల్ ద్వారా 5.17 కోట్ల విలువ గల 10 లక్షల లావాదేవీలు జరగ్గా.. ధరణి ద్వారా లక్షా 80వేల ఎకరాల భూములకు సంబంధించి పట్టాదార్ పాసు పుస్తకాలను అధికారులు జారీ చేశారు. ధరణి పోర్టల్ లో మరో 20 సమస్యలు గుర్తించిన ప్రభుత్వం వాటిని పరిష్కరించడానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది.