ఉప్పు-నిప్పు ఆలింగనం.. అనంతలో ఆసక్తికర 'రాజీ'కీయం...
posted on Nov 10, 2021 @ 3:27PM
పరిటాల ఫ్యామిలీ వర్సెస్ జేసీ బ్రదర్స్. అనంతలో ఏళ్లుగా సాగిన రాజకీయ వైరం. పగలు, ప్రతీకారాలతో దశాబ్దాల తరబడి ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ కొనసాగింది. పరస్పర దాడులు, హత్యలు, ఆక్రమణలు, కేసులతో సీమ నేల ఎరుపెక్కింది. పరిటాల రవి అధికారంలో ఉన్నప్పుడు జేసీ బ్రదర్స్‌ను టార్గెట్ చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక జేసీ ఫ్యామిలీ రివేంజ్ పాలిటిక్స్ చేసింది. వారిద్దరి పోరు.. రెండు పార్టీల వార్‌గా కొనసాగింది. కట్ చేస్తే.. పరిటాల రవీంద్ర హత్య.. ఆ తర్వాత జేసీ కుటుంబం టీడీపీలో చేరడం జరిగిపోయింది. ఒకే పార్టీలో ఉన్నా.. చాలా కాలం పరిటాల-జేసీల మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్‌రెడ్డి దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు ఆ వైరివర్గాలు రెండూ ఇప్పుడిప్పుడే ఏకమవుతున్నాయి. దశాబ్దాల తర్వాత జేపీ-పరిటాల చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది.
తాజాగా, అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు ఉప్పు-నిప్పులా ఉన్న జేసీ, పరిటాల కుటుంబాలు ఇప్పుడు ఆప్యాయంగా దగ్గరవుతున్నాయి. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. లోకేశ్‌ను స్వాగతించేందుకు జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి, పరిటాల కుటుంబం నుంచి శ్రీరామ్ వచ్చారు. అక్కడ ఆ ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం రాజకీయంగా కీలక పరిణామం.
పాత పగలు వదలిపెట్టి.. జేసీ ప్రభాకర్ రెడ్డి.. పరిటాల శ్రీరామ్‌ను దగ్గరకు తీసుకున్నారు. శ్రీరామ్ కూడా ప్రభాకర్ రెడ్డి పెద్దరికాన్ని గౌరవించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, శ్రీరామ్ ఆలింగనం చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏపీలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి శత్రువైన వైసీపీని దెబ్బతీసేందుకు జేసీ-పరిటాల కుటుంబాలు శత్రుత్వం వదిలి మిత్రులుగా మారుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఫ్యాక్షన్‌ను వదిలేయగా.. ఇప్పుడు వైరాన్నీ వదిలేసి.. జగన్‌రెడ్డిని ఎదురించడానికి చేతులు కలిపారు ఆ ఇద్దరు.