సీఎం వర్సెస్ సీఎండీ!.. లాంగ్‌లీవ్‌లో ప్రభాకర్‌రావు!.. దిగొచ్చిన కేసీఆర్!
posted on Nov 10, 2021 @ 4:08PM
తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంట్ పోదు. సమ్మర్‌లోనూ పవర్ కట్స్ ఉండవు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం ఉండదు.. అంటూ కేసీఆర్ ప్రతీ మీటింగ్‌లోనూ చెబుతుంటారు. ఇదంతా తన ఘనతేనంటూ డప్పు కొట్టుకుంటారు. కానీ, ఇదంతా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు గొప్పతనమే అంటారు విద్యుత్ ఉద్యోగులు. పని చేసేది అధికారులే అయినా.. ఆ ఫలితాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో కేసీఆర్‌ను మించినోళ్లు మరెవరూ ఉండరంటారు. అలాంటి ప్రభాకర్‌రావును సైతం సీఎం కేసీఆర్ పక్కన పెట్టేశారు. విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని తొక్కిపెట్టారు. కట్ చేస్తే.. కేసీఆర్‌పై అలిగి ప్రభాకర్‌రావు లాంగ్‌లీవ్‌లో వెళ్లిపోవడం.. మళ్లీ సర్కారు కాళ్లబేరానికి రావడం వరుసగా జరిగిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే....
విద్యుత్ కొనుగోళ్లకు చెల్లింపులు ఆగిపోవడం.. సంస్కరణలపై కేంద్రం ఒత్తిళ్లు.. విద్యుత్కేంద్రాలను స్వాధీనపరచాలని కృష్ణాబోర్డు తీర్మానాలు.. తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టలేకపోవడం.. తదితర కారణాలతో విద్యుత్ సంస్థలు దివాళా అంచునకు చేరాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పలుమార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు. ప్రతినెలా డిస్కమ్‌ల అప్పులపై వడ్డీలు, ఉద్యోగుల జీతాల కోసం రూ.1000 కోట్లకుపైగా అదనంగా ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలంటూ రెండున్నర నెలల క్రితం సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే.. సీఎండీ ఇచ్చిన ఫైలును కేసీఆర్ విసిరేసి.. విసుక్కున్నారని అంటున్నారు. ‘ఇంకెంతకాలం సాయం చేయాలి? పైసా కూడా అదనపు సాయం చేయలేం. డిస్కమ్‌ల ఆదాయాలు, అవసరాలు ఈఆర్‌సీలో దాఖలు చేయడానికి అనుమతిస్తాం. తద్వారా చార్జీలు సవరించి, ఆదాయం పెంచుకోండి’ అంటూ కేసీఆర్ సీఎండీ ప్రభాకర్‌రావుపై మండిపడ్డారట.
కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో సీఎండీ లాంగ్‌లీవ్ పెట్టినట్టు విద్యుత్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ప్రభాకర్‌రావు సెలవులో వెళ్లినప్పటి నుంచీ విద్యుత్ సంస్థల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో కేసీఆర్ దిగొచ్చారని చెబుతున్నారు. ప్రభాకర్‌రావుకు నచ్చజెప్పి తిరిగి విధుల్లో చేరేందుకు ఒప్పించినట్టు సమాచారం. దీంతో.. సీఎండీ ప్రభాకర్‌రావు తాజాగా బాధ్యతలు తీసుకున్నారు. వెనువెంటనే పలు సమీక్షలు నిర్వహించి పరిస్థితిని పర్యవేక్షించారు.
మరోవైపు.. డిస్కమ్‌ల ఆదాయం, అవసరాలకు మధ్య అంతరం తగ్గించేలా ఈఆర్‌సీలో ఏఆర్‌ఆర్ (వార్షిక ఆదాయ అవసరాల) దాఖలుకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఏఆర్‌ఆర్ సమర్పించడానికి అవసరమైన కసరత్తులో సీఎండీ ప్రభాకర్‌రావు బిజీ అయ్యారంటున్నారు. ఇలా కేసీఆర్‌నే దిగొచ్చేలా చేసిన అధికారి అంటూ ప్రభాకర్‌రావు గురించి విద్యుత్ ఉద్యోగులు గొప్పగా చెప్పుకుంటున్నారట.