మోడీ దెబ్బకు ట్రంప్ దిగివచ్చినట్లేనా?
posted on Sep 10, 2025 @ 4:23PM
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తొలగిపోనున్నాయా? ట్రంప్ టారీఫ్ వార్ నుంచి వెనక్కు తగ్గనున్నారా? ఇరు దేశాల మధ్యా వాణిజ్య సంబంధాలు మళ్లీ పూర్వ స్థితికి చేరుకోనున్నాయా? అంటీ పరిశీలకులు ఔననే అంటున్నారు. వరుస ఎదురుదెబ్బలతో భారత్ తో టారిఫ్ వార్ ను ముంగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంపర్లాడుతున్నారని అంటున్నారు. ఇరు దేశాల మధ్యా త్వరలో వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ వేర్వేరుగా సంకేతాలు ఇచ్చారు.
భారత్ తో వాణిజ్య చర్చల పునరుద్ధరణ ప్రతిపాదనను తొలుత డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చారు. ఇరు దేశాల మధ్యా అంతరం తనకు విచారాన్ని కలిగిస్తోంంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అంతే కాదు.. ఇరు దేశాలు సహజ భాగస్వాములు అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్యా వాణిజ్య అవరోధాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ ట్రూత్ వేదికగా ఆయన ఇంకా మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు మోడీ మంచి మిత్రుడిగా ఆభివర్ణించారు. ఆయనతో చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్రంప్ టారిఫ్ వార్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మోడీ.. అక్కడితో ఆగకుండా ట్రంప్ ఫోన్ కాల్స్ కు కూడా స్పందించని సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ఒక మెట్టు దిగడంతో మోడీ కూడా ఒకింత మెత్తబడినట్లు కనిపిస్తోంది. ట్రంప్ పోస్టులకు మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. త్వరలో ట్రంప్ తో మాట్లాడతానని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్యా వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా ట్రంప్ సానుకూల వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. తాజా పరిణామాలతో భారత్ పై అమెరికా టారిఫ్ టెర్రర్ కు ఎండ్ కార్డ్ పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.