క్రాస్ ఓటింగ్ పరువు తీసింది!
posted on Sep 10, 2025 @ 3:38PM
అనూహ్యం కాదు. అద్భుతం కాదు. అనుకున్నదే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్’ భారత 15 ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అవును.. గెలుపు ఓటముల వరకూ అయితే.. అధికార కూటమి అభ్యర్ధి గెలుపు అనూహ్యం కాదు. విపక్ష ఓటమి అసాధారమూ కాదు. అధికార కూటమి అభ్యర్ధి విజయంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ ఏ దశలోనూ లేవు.
కానీ.. జరిగింది అది కాదు. విపక్ష ఇండియా కూటమి సంఖ్యా బలం లేక ఓడి పోవడం మాత్రమే కాదు.. ఉన్న ఓటులో చీలిక వచ్చింది. క్రాస్ ఓటింగ్ జరిగింది. అది కూడా.. ఒకటీ రెండు ఓట్లు కాదు.. ఏకంగా 14 మంది ఇండియా కూటమి ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. అధికార కూటమి అభ్యర్ధి రాధాకృష్ణన్ కు ఓటేశారు. అందుకే.. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్ధి రాధాకృష్ణన్ కు పార్టీల బలాబలాల ప్రకారం రావలసిన 437 ఓట్లకు బదులుగా 452 ఓట్లు అంటే 14 ఓట్లు అదనంగా వచ్చాయి. విపక్ష ఇండియా కూటమి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డికి రావలసిన 315 ఓట్లకు గానూ, 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. ఇండియా కూటమి ఎంపీల్లో 14 మంది అధికార ఎన్డీఎకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో.. ఇండియా కూటమి ప్రధాన ఎన్నికల ప్లాంక్ అపొజిషన్ యూనిటీ, విపక్షాల ఐక్యత బొక్క బోర్లా పడింది. విపక్షాల ఐక్యత అయ్యే పని కాదని మరో మారు సందేహాలకు అతీతంగా తేలిపోయింది.
అలాగే.. ఇండియా కూటమి ఓట్లు అని అయితే చెప్పలేం కానీ.. మరో 15 ఓట్లు చెల్లకుండా పోయాయి.
అదొకటే కాదు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక విపక్ష ఇండియా కూటమిలో డొల్ల తనాన్ని బయట పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి.. అభ్యర్ధి ఎంపిక మొదలు పోలింగ్ మేనేజిమెంట్ వరకు.. ప్రతి నిర్ణయంలోనూ ఇండియా కూటమి తప్పటడుగులే వేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా.. ఓ వంక కులగణన పేరిట బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ పాలక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డి ని ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా ఎంపిక చేసింది. ఇది ఇండియా కూటమి నాయకత్వం చేసిన తోలి పెద్ద తప్పుగా పరిశీలకులు పేర్కొంటున్నారు.
అలాగే.. సుదర్శన్ రెడ్డి ప్రయోగించిన తెలుగు వారి ఆత్మ గౌరవం కార్డు కూడా పనిచేయలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్,ఎంఐఎం తప్ప జగన్ రెడ్డి పార్టీ వైసేపీతో సహా మరే పార్టీ కూడా రెడ్డి గారికి మద్దతు ఇవ్వలేదు. అంతే కాదు.. పుండు మీద కారం పూసినట్లుగా 11 మంది ఎంపీలున్న వైసీపీ ఏకంగా ఎన్డీయేకి మద్దతు ఇచ్చింది. స్వరాష్ట్రం తెలంగాణలోనూ సుదర్శన్ రెడ్డి అదనంగా ఒక్క ఎంఐఎం ఓటు మాత్రమే యాడ్ అయింది. నిజానికి.. ఇండియా అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి కాకుండా ఇంకేవరైనా కూడా ఎంఐఎం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇండియా కూటమి అభ్యర్ధికే ఓటు వేస్తారనేది, జగ మెరిగిన సత్యం. మరో వంక నలుగురు రాజ్య సభ ఎంపీలున్న బీఆర్ఎస్ యూరియ కొరతను సాకుగా చూపి పోలింగ్ కు దూరంగా ఉండి పోయింది.
అదలా ఉంచితే.. పోల్ మేనేజిమెంట్ విషయంలో ఇండియా కూటమి పూర్తిగా తప్పులో కాలేసిందని అంటున్నారు. ముఖ్యంగా ఏకంగా 15 ఓట్లు చెల్లలేదంటే.. ఇండియా కూటమి పోల్ మేనేజిమెంట్ ఎంత పూర్ గా వుందో అర్థమవుతుందని అంటున్నారు. అలాగే.. చివరకు రాహుల్ గాంధీ, పోలింగ్ బూత్ కు ఎలా వెళ్ళాలో తెలియక తడబడ్డ తీరును చూస్తే.. ఎక్కడో దిద్దుకోలేని తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోందని అంటున్నారు.
మరో వంక బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి, త్వరలో ఆసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళ నాడు రాష్ట్రానికి చెందిన మహా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ ను అభ్యర్ధిగా ఎంపిక చేయడం మొదలు పోల్ మేనేజెమెంట్ వరకు ఎక్కడా చిన్న తప్పైనా జరగకుండా పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగింది. అందుకే రాధాకృష్ణ అనూహ్య మార్జిన్ తో విజయంసాధించారు. అందుకే విపక్ష ఇండయా’ కూటమి అభ్యర్ధిది కేవలం ఓటమి కాదు.. అంతకు మించి.