బండి సంజయ్ పై కోడిగుడ్ల దాడి.. కేసీఆర్ పై కమలం నేతల ఫైర్..
posted on Nov 15, 2021 @ 4:50PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లా యాత్ర తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టించింది. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లాలు తిరుగుతున్న బండి సంజయ్.. నల్గొండ జిల్లాలోని పలు ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. అయితే సంజయ్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో సంజయ్ యాత్ర పొడవునా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. కొని ప్రాంతాల్లో సంజయ్ కాన్వాయ్ పై రాళ్లు, కోడిగుడ్లు విసరడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.
నల్గొండ శివారులోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద బండి సంజయ్ కారును నల్గొండ ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులకు పోటీగా బీజేపీ కార్యకర్తలు నినదించారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే భూపాలరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు పార్టీలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేశారు. నల్ల జెండాలు దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
తర్వాత మిర్యాలగూడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బండి కాన్వాయ్ పై రాళ్ల దాడికి యత్నించగా.. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు తరిమికొట్టారు. తన పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడటంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు .రైతుల కోసం రాళ్ల దాడికి కూడా సిద్ధమేనని బండి సంజయ్ అన్నారు. సమస్య పరిష్కరించకుండా ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని, టీఆర్‌ఎస్ శ్రేణులు రైతుల్లా వచ్చి గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బాధ్యతను మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. పండిన ప్రతి గింజా కొంటామని గతంలో సీఎం చెప్పారన్నారు. వానాకాలంలో పంట మొత్తం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే కేసీఆర్ ఏం చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.